షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట వెల్లువెత్తిన ప్రజాగ్రహం

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట వెల్లువెత్తిన ప్రజాగ్రహం

priyankareddy

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. ప్రియాంకకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం నుంచే అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. అదనపు బలగాల్ని మోహరించినా బారీకేడ్లు పెట్టినా కూడా వారిని నిలువరించలేకపోతున్నారు. ఇలా గొంతెత్తి నినదిస్తున్న వాళ్లలో చదువురాని సామాన్యుడు మొదలుకొని విద్యార్థులు, వృద్ధులు, మహిళలు అంతా ఉన్నారు. కోర్టుల్లో నెలల తరబడి విచారణ జరిపే బదులు స్పాట్ జడ్జిమెంటే ఉండాలంటున్నారు. పోలీసుల్ని తోసుకుంటూ మరీ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో.. ముందు జాగ్రత్తగా గేట్లకు చైన్లు బిగించి తాళం వేశారు. వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి రోడ్డుపనే బైఠాయించి గంటల తరబడి కదలకుండా న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రియాంక ఘటన సమాజాన్ని ఎంతగా కదిలించిందో చెప్పడానికి ఈ దృశ్యాలే సాక్ష్యం.

ఈ కేసులో అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరచే పరిస్థితి కూడా లేదు. బయటకు తీసుకొస్తే మూకదాడి జరిగే అవకాశం ఉండడంతో.. అప్రమత్తంగానే ఉన్నారు. ప్రస్తుతం షాద్‌నగర్‌ మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ముందు నిందితుల్ని ప్రవేశపట్టి అట్నుంచి జైలుకు తరలించొచ్చంటున్నారు. వీళ్లను తరలించేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లపై నలుగురు రాక్షసులు సాగించిన దాష్టీకాన్ని తలుచుకుంటే రక్తం మరిగిపోతోంది. షాద్‌నగర్‌లోనే కాదు ఎక్కడిక్కడ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. నిందితుల్ని ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై అమ్మాయిలపై చెయ్యి వెయ్యాలంటే భయపడేలా.. ఈ ఉన్మాదుల బహిరంగ ఉరితీత సమాజానికి ఒక గుణపాఠం కావాలంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story