అమరావతికి మరో బిగ్ షాక్.. సింగపూర్ కన్సార్షియం ఔట్

అమరావతికి మరో బిగ్ షాక్.. సింగపూర్ కన్సార్షియం ఔట్

ama

ఏపీ రాజధాని అమరావతికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటి వరకు రాజధానిపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో నిర్మాణాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు అమరావతి నిర్మాణంలో కీలకమైన స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ఒప్పందం నుంచి సింగపూర్ కన్సార్షియమ్‌ కూడా తప్పుకుంది.

రాష్ట్ర ఏర్పాటు తరువాత.. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించేందకు 2017లో ఏపీ ప్రభుత్వంతో సింగపూర్ ఈ ప్రాజెక్టుపై MOU కుదుర్చుకుంది. 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి అంగీకారం తెలిపింది. ఈ 1691 ఎకరాల్లో దాదాపు 460 ఎకరాల్లో వాణిజ్యపరమైన అంశాల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. మొత్తం 3 దశల్లో మిగతా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఒప్పందం చేసుకున్నా.. అది అటకెక్కింది.

మాస్టర్ డెవలపర్‌గా ఉన్న ఈ కన్సార్షియం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌-ADCతో కలిసి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలనుకుంది. దీని కోసం సింగపూర్- అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్‌ లిమిటెడ్ పేరుతో ఓ అనుబంధ సంస్థను కూడా నెలకొల్పారు. ఇందులో 58 శాతం వాటా సింగపూర్‌ది, 42 శాతం ADCది ఉంది. దీన్ని కొనసాగింపునకు అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ పేరుతో ఒక SPVని ఏర్పాటు చేశారు. ఐతే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో చర్చలు జరిపింది. ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం వైదొలిగితే కన్సార్షియానికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కొనసాగింపుపై కాలయాపన చేస్తూ వచ్చింది.

ఏపీ కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాల్లో అమరావతి లేనందున.. పరస్పర అంగీకారంతో ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. ఐతే.. భవిష్యత్‌లో కలిసి పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌, ఏపీల్లో సింగపూర్ వాణిజ్య సంస్థల పెట్టుబడులపై.. ఈ ఒప్పందం రద్దు ప్రభావం ఉండబోదని అన్నారు. పెట్టుబడి సంస్థలు లాభ నష్టాల్ని బేరీజు వేసుకుని వెళ్తాయని.. అమరావతిపై ఈ ప్రభావం కొంత మేరకే ఉంటుందన్నారు.

ఏపీ రాజధానికి అమరావతిని కొనసాగించే విషయంలో వైసీపీ ప్రభుత్వం మొదట నుంచి అంత సుముఖంగా లేదు. దీనిపై నిపుణుల కమిటీని కూడా వేసింది. ఆ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాజధాని కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story