అయోధ్య వివాదంలో ఎన్నో వాజ్యాలు, మరెన్నో మలుపులు..

అయోధ్య వివాదంలో ఎన్నో వాజ్యాలు, మరెన్నో మలుపులు..

AYODYA.png

సుప్రీం కోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వందేళ్లుగా కోర్టులో ఉన్న అయోద్య రామజన్మ భూమి అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల దర్మాసనం తీర్పునిచ్చింది. అయోధ్య వివాదం ఇప్పటిది కాదు. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఎన్నో వాజ్యాలు, మరెన్నో మలుపులు. తీర్పులు వచ్చిన ప్రతిసారీ సంచలనమే. ఈసారి హేతుబద్ధ ధోరణిలో, సాక్ష్యాధారాల ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఈ కేసు చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. 1885లో బాబ్రీ మసీదు ప్రాంగణంలోని రామ్‌ఛబుత్ర ప్రాంతంలో రామ మందిరం నిర్మాణానికి అనుమతి కోరుతూ మహంత్ రఘువర్‌ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు. దానిపై మసీదు ముతావలి సైతం మరో కేసు వేశారు. కోర్టు కొట్టివేసింది.

1949లో మసీదులో రాముడు, సీతాదేవి విగ్రహాల్ని ప్రతిష్టించారంటూ పోలీసు కేసు నమోదైంది. దీంతో.. ఫైజాబాద్ మెజిస్ట్రేట్ ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి.. తాళాలు వేశారు. అయితే.. 1950 జనవరిలో.. కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సీజ్‌ చేసిన ప్రాంతాన్ని తెరిపించి.. పూజలకు అనుమతించాలని గోపాల్‌సింగ్ విశారద్, రమచంద్రదాస్ పరమహంస న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాబ్రీ మసీదు తమ ఆస్తి అంటూ 1961లో ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ వేసింది. హిందువులు వేసిన పిటిషన్లను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. 1986 ఫిబ్రవరిలో బాబ్రీ మసీదును తెరిపించి, హిందువులు పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. అదే ఏడాది బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ఏర్పడింది. 1989లో బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదానికి సంబంధించిన కేసులన్నీ అలహాబాద్‌ హైకోర్టుకు బదలాయించారు. 2002 ఏప్రిల్‌లో అయోధ్య స్థల యాజమాన్యంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

బాబ్రీ మసీదు కింద ఆలయం ఉన్నట్టు భారత పురాతత్వ పరిశోధన సంస్థ - ASI చారిత్రక ఆధారాలు బయటపెట్టింది. సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన తీర్పులో ఆ నివేదిక కీలకంగా మారింది. అయితే.. ASI రిపోర్ట్‌తో ముస్లిం సంస్థలు విభేదించాయి. 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పుచెప్పింది. వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. రెండు భాగాలు హిందువులకు, ఒక భాగాన్ని ముస్లింలకు పంచాలంటూ చారిత్రక తీర్పు చెప్పింది. అయితే.. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీ చేసింది.

2017 డిసెంబర్‌లో ఈ కేసు క్లైమాక్స్‌కు చేరింది. సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటైంది. కొన్ని రోజులకు ధర్మాసనాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ప్రయత్నం చేసింది. అందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా నేతృత్వంలో... శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్‌పంచు సభ్యులుగా మధ్యవర్తుల కమిటీని నియమించింది. అయితే.. వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో.. ఈ ఏడాది ఆగస్టు 6న సుప్రీంకోర్టు రోజువారీ విచారణ మొదలుపెట్టింది. 14 అప్పీళ్లపై 40 రోజులు విచారణ చేసింది. ఆ తర్వాత లిఖితపూర్వకంగాను కక్షిదారుల నుంచి అభిప్రాయాలు కోరింది. అందరి వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. వివాదాస్పద స్థలం హిందువులదేనంటూ తీర్పు చెప్పింది. మూడు నెలల్లో చట్టబద్ధంగా అయోధ్యపై ట్రస్టు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story