రైలు పట్టాలమీద నడుస్తున్నారా..?

రైలు పట్టాలమీద నడుస్తున్నారా..?

రైలు పట్టాలమీద నడుస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మిమ్మల్ని యమధర్మరాజు ఎత్తుకుపోతాడు.. యమధర్మరాజేంటి..? ఎత్తుకుపోవడమేంటి..? అని పరేషాన్‌ అవుతున్నారా.. అవును, ముంబైలో రైలు పట్టాలపై నడిచేవారికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. పట్టాలపై మనిషి కనిపించడం ఆలస్యం హఠాత్తుగా ప్రత్యక్షమై ఎత్తుకుని వెళ్లిపోతున్నాడు. అయితే, ఆయన నిజమైన యముడు కాదు.. ముంబై పశ్చిమ రైల్వే అధికారుల ఐడియా ఇలా వర్కవుట్‌ అవుతోంది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌కు చెందిన కొందరు సిబ్బందికి యముడి వేషం కట్టించి రైల్వే స్టేషన్లలో నియమించారు అధికారులు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను పట్టించుకోకుండా ట్రాక్‌లను దాటే వారిని గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు.

ముంబై సబర్బన్‌ పరిధిలో రైళ్లు ఢీకొని రోజూ సగటున 10 మంది వరకు చనిపోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు పశ్చిమ రైల్వే పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు దాటినందుకు 13,463 కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సరికొత్త ఆలోచనను అమలు చేస్తున్నారు రైల్వే అధికారులు.

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నా అటువైపు వెళ్లకుండా ట్రాక్‌లు దాటే ప్రయత్నం చేస్తున్న ఓ యువకుణ్ని గుర్తించిన యముడి వేషంలోని ఆర్పీఎఫ్‌ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ అక్కడికి వచ్చి ఆ యువకుణ్ని ఎత్తుకెళ్లి ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చాడు. ప్రాణాలను పట్టించుకోకుండా పట్టాలు దాటితే నిజంగానే యముడు ఎత్తుకెళ్లిపోతాడంటూ ఇలా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ముంబై రైల్వే అధికారులు. మొదట్లో ముంబైలోని అంధేరి, మలాడ్‌ రైల్వే స్టేషన్లలో ఈ ఐడియాను అమలు చేశారు. ఆ తర్వాత మరికొన్ని చోట్లా వర్కవుట్‌ చేసే పనిలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story