ఠాక్రే కుటుంబం నుంచి తొలి సీఎం..

ఠాక్రే కుటుంబం నుంచి తొలి సీఎం..

uddhav

మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా ముగిసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు మార్గం సుగమమైంది. ఠాక్రే కుటుంబం తొలి సీఎంగా గురువారం శివాజీ పార్క్‌లో ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు నెల రోజులుగా అనూహ్య పరిణామాలు, ఉత్కంఠ భరిత మలుపులతో సాగిన మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం కీలక ఘటనలు చోటుచేసుకుంది. బుధవారంలోగా బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంతీర్పుతో ప్రారంభమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల పార్టీలు మహారాష్ట్ర వికాస్‌ అఘాడిసేనగా ఏర్పడి.. ఉద్ధవ్‌ ఠాక్రేను తమ నేతగా, తదుపరి సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ముగిసింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే కాళీదాస్‌ కొలాంబ్కర్‌ను గవర్నర్‌ ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన 288 ఎమ్మెల్యేలతో నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

గురువారం శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉద్ధవ్‌ తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే హయాం నుంచి ఠాక్రే కుటుంబం దశాబ్దాలుగా మహారాష్ట్రలో చక్రం తిప్పుతున్నా.. ప్రభుత్వ పదవిని ఠాక్రే కుటుంబం చేపట్టడం ఇదే తొలిసారి. ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్, కాంగ్రెస్‌ నాయకుడు బాలాసాహెబ్‌ తోరట్‌ ఉప ముఖ్యమంత్రులయ్యే అవకాశం ఉంది. మిగతా కేబినెట్‌ ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుంది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ కలుస్తానని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్ధవ్‌ ఠాక్రేను తన చిన్న తమ్ముడిగా మోదీ అభివర్ణించారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా పగ, ప్రతీకారం ఉండవన్నారు ఉద్దావ్. ఎవరిపై కక్షసాధింపు చేపట్టబోమని స్పష్టం చేశారు. వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలు నేడు కలిశాయి. 30 ఏళ్లు స్నేహితులుగా ఉన్నవారు మమ్మల్ని నమ్మలేదు. ఎవరికి వ్యతిరేకంగా 30 ఏళ్లు పోరాడామో వారు మమ్మల్ని విశ్వసించారు. ఈ ప్రభుత్వం మాదని ప్రతీ సామాన్యుడు అనుకునేలా పాలన సాగిస్తామన్నారు ఉద్దావ్ థాకరే.

అజిత్‌పవార్‌ను మళ్లీ ఎన్సీపీలోకి తీసుకువచ్చేందుకు పవార్‌ కుటుంబం తీవ్రంగా కృషి చేసింది. అజిత్‌ తిరిగి ఎన్సీపీలోకి వచ్చేందుకు వీలుగానే శరద్‌ పవార్‌ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. అజిత్‌ పవార్‌ను మళ్లీ వెనక్కు తీసుకువచ్చేందుకు ఎన్సీపీ నేతలు, పవార్‌ కుటుంబం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అజిత్‌ను వెనక్కు రావాల్సిందిగా ట్వీటర్‌ వేదికగా పవార్‌ కుటుంబ సభ్యులు విజ్ఙప్తి చేశారు. చివరకు చిన్నమ్మ అయిన శరద్‌ పవార్‌ సతీమణి ప్రతిభా పవార్‌ సూచనలతో అజిత్‌ తిరిగి సొంతగూటికి చేరారు. రాజీనామా అనంతరం ఆయన శరద్‌ పవార్‌ నివాసానికి వచ్చి సమావేశమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story