కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం నుంచి మూడురోజులపాటు జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగనుంది. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి భవిష్యత్‌ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు.. సోమవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు జిల్లాలోనే ఉండి నేతలకు పలు సూచనలు చేయనున్నారు. ఉదయం పది గంటలకు మహబూబ్‌నగర్‌ సరిహద్దులోని పుల్లూర్‌ టోల్‌ ప్లాజా దగ్గరకు చేరుకుంటారు. అక్కడ చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి బైక్‌ ర్యాలీలతో జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు. అనంతరం కర్నూలులోని పీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. జిల్లాకు చెందిన టీడీపీ నేతలంతా సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక్కో నియోజకవర్గానికి చెందిన నేతలతో విడివిడిగా సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన చంద్రబాబు.. స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మంగళవారం ఉదయం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అనేక ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. అక్రమ కేసులతో బాధపడుతున్న బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నేతలతో విడివిడిగా చర్చించనున్నారు. ఎల్లుండి బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు.

మూడు రోజుల పర్యటనలో జిల్లా నేతలు పలు అంశాలను, స్థానిక పరిస్థితులను అధినేత దృష్టికి తీసుకెళ్లనున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధులు మధ్యలో ఆగిపోవడం, వైసీపీ నేతలు టీడీపీ వర్గీయులను టార్గెట్‌ చేసి దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం వంటి అంశాలతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇసుక సమస్య, పార్టీ బలోపేతం ఇలా అనేక అంశాలపై చంద్రబాబుతో చర్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story