కర్నాటక రాజకీయ ముఖచిత్రాన్ని డిసైడ్ చేసే ఎన్నికలకు సర్వం సిద్ధం

కర్నాటక రాజకీయ ముఖచిత్రాన్ని డిసైడ్ చేసే ఎన్నికలకు సర్వం సిద్ధం

BI-ELECTION

కర్ణాటక రాజకీయాల్లో గురువారం మరో కీలకమైన రోజు. 15 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికలతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల భవితవ్యం తేలిపోనుంది. మెజార్టీ సీట్లు సాధిస్తే యడ్యూరప్ప ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే, ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఓటింగ్ సజావుగా జరిపేలా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగుతారా? లేక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందా..? ఈ ప్రశ్నలకు కొన్ని రోజుల్లో సమాధానాలు రానున్నాయి. యడ్యూరప్ప ప్రభుత్వం భవితవ్యం తేలిపోయే సమయం వచ్చేసింది. అత్యంత కీలకమైన ఉప ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు కల్పించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

ఉప ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లకు అగ్ని పరీక్షగా మారాయి. ముఖ్యంగా అధికార బీజేపీకి ప్రాణసంకటమయ్యాయి. 15 సీట్లలో కనీసం 8 స్థానాలు గెలుచుకుంటేనే యడ్యూరప్ప ప్రభుత్వానికి భరోసా లభిస్తుంది. ఏమాత్రం అటూ ఇటైనా ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయి. బై ఎలక్షన్స్‌లో సత్తా చాటి యడ్యూరప్ప సర్కారును గద్దె దింపాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు కాచుక్కూచున్నాయి. రెండు పార్టీలు కూడా సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేశాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఓటుతో బుద్ది చెప్పాలని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేశాయి. జేడీఎస్ అధినేత-మాజీ ప్రధాని దేవేగౌడ కూడా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

ఉప ఎన్నికలను కమలదళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓడిపోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదముండడంతో సకల జాగ్రత్తలు తీసుకుంది. స్వయంగా సీఎం యడ్యూరప్ప బై ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. చివరి రెండు మూడు రోజుల్లో కులంకార్డును కూడా జోరుగా ఉపయోగించారు. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన విజయనగర నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు బీజేపీ రెబల్‌ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి అనంద్‌సింగ్‌ గెలుపు కోసం సీఎం యడ్యూరప్ప, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేశారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి మాజీ సీఎంలు కుమారస్వామి, సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌గుండూరావు సహా పలువురు సీనియర్లు ప్రచారం చేశారు.

బైపోలింగ్ లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో సస్పెన్స్ నెలకొన్నా.. కర్ణాటక హిస్టరీలో మాత్రం ఫిరాయింపుదారులు గట్టెక్కిన ఉదంతాలు 10 శాతం మాత్రమే ఉన్నాయి. పార్టీలు మారిన ప్రజాప్రతినిధులకు ప్రజలు పట్టం కట్టడం చాలా అరుదు. అందుకే కమలదళం కంగారు పడుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ నుంచి ఫిరాయించిన 15 మంది ఎమ్మెల్యేల్లో 13 మందికి కమలదళం టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి ఈ 15 మందే కారణం. అప్పుడు చేసిన మేలుకు ప్రతిఫలంగా ఉప ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది. రమేష్ జార్ఖిహోళీ, మహేష్‌ కుమతల్లి, శ్రీమంతగౌడ పాటిల్‌, బీసీ పాటిల్‌, ఆనంద్‌ సింగ్‌, భైరతి బసవరాజ్‌, ఎస్‌టీ సోమశేఖర్‌, ఎంటీబీ నాగరాజ్‌, కేసీ నారాయణ గౌడ, హెచ్‌ విశ్వనాధ్‌ సహా 13 మంది బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story