రాజధాని అంశంపై టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

రాజధాని అంశంపై టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

babu

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లేలా టీడీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. గురువారం విజయవాడలో అన్ని పక్షాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తాము ప్రణాళికలు రచించి అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుడితే కక్ష సాధింపుతో జగన్‌ ప్రభుత్వం దానిని చంపేసే కుట్ర చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. అమరావతి మనుగడ లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఉండదన్న నినాదంతో పోరుబాటకు టీడీపీ సిద్ధమైంది.

ప్రజా రాజధాని అమరావతి పేరిట విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగనుంది. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాజధాని రైతులు, ప్రజలతోపాటు వైసీపీ మినహా 17 రాజకీయ పార్టీలు, 22 విభాగాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, ఎడిటర్లు, మేధావులు, వివిధ అసోసియేషన్ల నేతలకు ఆహ్వానాలు పంపారు. వీటిలో 90 శాతం మంది ఇప్పటికే సానుకూలత తెలుపగా.. మిగిలిన వాళ్లు కూడా భేటీకి వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది.

రాజధాని ఒకటి, రెండు జిల్లాలకే పరిమితమని తప్పుడు ప్రచారం వైసీపీ చేస్తోందని.. దీనిని తిప్పికొడుతూ అమరావతి రాష్ట్రానికి ఆదాయ వనరు అనే స్పష్టతను సమావేశం ద్వారా ఇవ్వనున్నారు. మంత్రులు రాజధానిపై తలోమాట మాట్లాడి గందరగోళం సృష్టిస్తుంటే ముఖ్యమంత్రి మౌనం వహిస్తుండటం కుట్రలో భాగమేనన్నది టీడీపీ ఆరోపణ. సర్వత్రా ఆందోళన నెలకొన్న రాజధాని అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పష్టమైన ప్రకటన ఇప్పించేలా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలు, సలహాల ఆధారంగా తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.

తెలుగువారికి చిరునామాగా అమరావతి నిర్మాణం చేపట్టడంతోపాటు రాజధాని వల్ల పెరిగే సంపదను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని వర్గాల్లో విస్తృత చర్చ జరగాలన్నది టీడీపీ భావన. ఒక ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడం ద్వారా ఆదాయం, ఉద్యోగాలు సృష్టించాలన్న ఒక వినూత్న ఆలోచనను జగన్‌ ప్రభుత్వం నాశనం చేస్తున్న తీరును ప్రజలకు తెలియజెప్పేందుకే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు ఇప్పటికే టీడీపీ ప్రకటించింది.

అటు అమరావతిలో పూర్తి కావాల్సి వచ్చిన నాలుగు భవనాలు మినహా మరేం లేదని మంత్రులు చేసిన వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. మంత్రులు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్లో అపోహ పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ. రెండేళ్లలోనే నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ప్రాంగణాలతోపాటు విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాలయాలు, మంత్రులు రోజూ ప్రయాణించే సీడ్‌ యాక్సిస్‌ రహదారి వంటి వాటిని ఈ సమావేశం ద్వారా మరోసారి ప్రజల ముందు ఆవిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర విభజన నాటి పరిస్థితుల నుంచి చట్టంలో రాజధాని ఎక్కడో తెలుపకపోవడం, అమరావతి నిర్మాణం సాగిన తీరు వంటి అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సవివరంగా పవర్‌ పాయింట్‌, మీడియా ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

అమరావతితోపాటు అన్ని నగరాలు అభివృద్ధి జరగాలన్నదే తమ అభిమతమని ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ద్వారా టీడీపీ స్పష్టం చేయనుంది. రాజధాని అంటూ ఒకటి లేకపోతే మరే నగరమూ అభివృద్ధి సాధ్యం కాదనేది టీడీపీ వాదన. అమరావతిని అభివృద్ధి చేస్తూనే విశాఖ, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు వంటి నగరాలు అభివృద్ధి జరగాలన్నది తమ విధానమని ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ద్వారా టీడీపీ నేతలు స్పష్టం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story