టీమిండియా జైత్రయాత్రకు బ్రేకులు వేసిన వెస్టిండీస్‌

టీమిండియా జైత్రయాత్రకు బ్రేకులు వేసిన వెస్టిండీస్‌

shivam

టీమిండియా జైత్రయాత్రకు వెస్టిండీస్‌ బ్రేకులు వేసింది.. భారత్‌ చేతిలో వరుసగా ఏడు మ్యాచ్‌ల ఓటమికి తెరదించుతూ మూడు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్‌ ప్లేయర్లు రసవత్తరంగా మార్చేశారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో తమ దమ్మేంటో చూపించారు. చాలారోజుల తర్వాత వెస్టిండీస్‌ స్థాయికి తగిన ఆటతీరుతో ఆల్‌ రౌండ్‌ షోను కనబర్చారు. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పవర్‌ హిట్టింగ్‌తో భారత బౌలర్లు తేలిపోయారు. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా స్లోపిచ్‌పై పరుగులు సాధించేందుకు తీవ్రంగా కష్టపడింది.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ విఫలం కాగా.. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కెరీర్‌లో తొలిసారి మూడో స్థానంలో వచ్చిన శివం దూబే తన పవర్‌ హిట్టింగ్‌ను చూపించాడు.. మిగతా బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడిన చోట అలవోకగా షాట్లు ఆడేశాడు.. మొదట నిదానంగా ఆడిన దూబే.. ఎనిమిదో ఓవర్‌ నుంచి గేరు మార్చాడు.. మొత్తం 30 బంతుల్లో దూబే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 54 పరుగులు చేయగా.. రిషబ్‌ పంత్‌ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

171 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. ఓపెనర్లు లూయిస్‌, సిమ్మన్స్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత హెట్‌మయెర్‌, పూరన్‌ ధాటికి చివర్లోనూ భారత బౌలర్లు భారీగా పరుగులిచ్చేశారు.. దీనికితోడు ఐదో ఓవర్లో ఓపెనర్ల క్యాచ్‌లను వాషింగ్టన్‌ సుందర్‌, పంత్‌ వదిలేయడంతో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ జూలు విదిల్చారు. ఓపెనర్‌ సిమ్మన్స్‌ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.. చివర్లోనూ వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ మెరుపులతో మ్యాచ్‌ భారత చేజారిపోయింది.. దీంతో మూడు టీ-20ల సిరీస్‌ సమం అయింది.. బుధవారం ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకం కానుంది.

Tags

Read MoreRead Less
Next Story