క్రమశిక్షణ పాటించకపోతే.. ఆర్ధికమాంద్యం ప్రభావాన్ని ఎదుర్కోలేం: కేసీఆర్

క్రమశిక్షణ పాటించకపోతే.. ఆర్ధికమాంద్యం ప్రభావాన్ని ఎదుర్కోలేం: కేసీఆర్

kcr

అన్ని ప్రభుత్వ శాఖలు కఠిన ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు సీఎం కేసీఆర్. అలాగైతేనే ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొగలమని అన్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపైనే ప్రధానంగా చర్చించారు. పల్లెప్రగతి పట్ల అధికారుల నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దుమ్ముగూడెం బ్యారేజి, మిడ్ మానేరు విస్తరణ పనులను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్ర మంత్రివర్గం బుధవారం సాయంత్రం ప్రగతిభవన్ లో సమావేశమైంది. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. 3,482 కోట్ల అంచనా వ్యయంతో 37 టీఎంసీల నీటినిల్వ, 320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఏడాదికి ఐదారు నెలల పాటు పుష్కలంగా నీటి లభ్యత ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని.. పైగా భూసేకరణ అవసరం లేకుండా బ్యారేజి నిర్మాణం చేపట్టవచ్చని అధికారులు తెలపటంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి కేబినెట్ ఒకే చెప్పింది.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు వరకు 3 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుత ప్రాజెక్టు రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందున 3 టీఎంసీల నీటి తోడొచ్చని అధికారులు ప్రతిపాదించారు. దీంతో 11,806 కోట్ల అంచనా వ్యయంతో విస్తరణ పనులకు కేబినెట్ ఆమోదించింది. ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేబినెట్ ప్రధానంగా చర్చించింది. ఆర్థిక మాంద్యంతో రాష్ట్రంలో కూడా ఆదాయాలు పడిపోయాయని సీఎం అన్నారు. దీనికితోడు కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్, జీఎస్టీ నష్ట పరిహారం తదిరత నిధులు రావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొవాలంటే అన్ని శాఖలు కఠినమైన ఆర్ధిక నియంత్రణ పాటించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ కేటాయింపులకు మించి ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయడానికి వీల్లేదన్నారు. అదనపు ఆదాయం రాబట్టే అవకాశాలపై మంత్రివర్గంలో చర్చించారు

గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పాటించేలా చేపట్టిన పల్లెపగ్రతి కార్యక్రమంలో అధికారులు అలసత్వంపై సీఎం సీరియస్ అయ్యారు. గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చినా.. ఈ కార్యక్రమం స్పూర్తిని కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. ఎలాంటి అలసత్వం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. గతంలో 30 రోజుల కార్యక్రమం నిర్వహించనట్లుగానే వచ్చే నెలలో పది రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story