తెలంగాణలో రోడ్డెక్కిన బీజేపీ అంతర్గత పోరు

తెలంగాణలో రోడ్డెక్కిన బీజేపీ అంతర్గత పోరు

dk-aruna

తెలంగాణ బీజేపీలో అంత‌ర్గత విభేదాలు మ‌రోమారు భగ్గుమ‌న్నాయి. కీల‌క అంశంపై నేత‌లు విరుద్ద ప్రక‌ట‌న‌లతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. మ‌ద్యపానాన్ని నిషేధించాలంటూ డీకే అరుణ ఉద్యమానికి సిద్దమ‌వుతుంటే.. మ‌హిళ‌ల‌పై దాడుల‌కు, మద్యపానానికి సంబంధమే లేదంటున్నారు ఆ పార్టీ జాతీయ ప్రదాన కార్యద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావ్. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు.. విరుద్ధ ప్రకటనలు చేయడం.. తెలంగాణ బీజేపీలో దుమారం రేపుతోంది.

తెలంగాణలో మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. దిశ, స‌మ‌త, మ‌మ‌త కేసులు వ‌రుస‌గా జ‌ర‌గ‌డం ఆందోళన కలిగిస్తోంది. మ‌ద్యం మ‌త్తులోనే ఈ దారుణాలు చేస్తున్నారు నేరస్తులు. దీంతో మద్యాన్ని నిషేధించాలంటూ బీజేపీ పోరాటం మొదలుపెట్టింది. ఆ పార్టీ నేత.. డీకే అరుణ ఈ పోరాటాన్ని క్షేత్ర స్థాయి వ‌ర‌కు తీసుకు వెళ్ళే ప్రయ‌త్నం చేస్తున్నారు. గురువారం ఇందిరా పార్క్ వ‌ద్ద.. దీక్షకు దిగనున్న డీకే అరుణ.. రెండు రోజుల పాటు చేయనున్నారు.

అయితే.. ఇదే సమయంలో ఆ పార్టీ జాతీయ కార్యద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావు వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మ‌ద్యానికి, మ‌హిళ‌ల‌పై దాడుల‌కు ఎలాంటి సంబంధం లేదన్నారాయన. ఇత‌ర అంశాలు మహిళపై దాడులకు కారణమవుతున్నాయంటున్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

మ‌ద్యంపై ద‌శల వారిగా పోరు సాగిస్తామ‌ని పార్టీ అధ్యక్షుడి అనుమ‌తితో డీకే అరుణ‌ దీక్షకు దిగుతుంటే.. అటు సీనియర్‌ నేత మురళీధర్ రావు విరుద్ధ ప్రకటన చేయడం చూస్తుంటే ఇద్దరి మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిని ఎలా సముదాయించాలో అర్థంకాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు సీనియర్‌ నేతలు. విభేదాలు ఉంటే అంత‌ర్గతంగా మాట్లాడుకోవాలి త‌ప్ప ఇలా విరుద్ద ప్రక‌ట‌న‌లు చేయ‌డం ఏంట‌ని మండిపడుతున్నారు బీజేపీ నేతలు.

బీజేపీ త‌ల‌పెట్టిన ఏ పోరాటమైనా ఒక‌టి రెండు నిర‌సనలకే ప‌రిమితవుతుందనే అపవాదు ఉంది. ఇప్పుడు ఒకే అంశంపై పోరాటానికి చేస్తున్న నేపథ్యంలో నేతలు ఇలా విరుద్ద ప్రక‌ట‌న‌లతో.. ప్రజ‌ల‌కు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story