దిశ హత్యకేసులో బలమైన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు

దిశ హత్యకేసులో బలమైన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు

disha

రాష్ట్రంలో సంచలనం కలిగించిన దిశ హత్యాచారం, హత్య నిందితుల ఎన్ కౌంటర్ లో ఫోరెన్సిక్ రిపోర్టు కీలకం కానుంది. ఇప్పటికే ఈ కేసుపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ వేసిన నేపధ్యంలో.. పోలీసులు ఆధారాల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. హత్యాచారం చేసిన సమయంలో నిందితులు బలవంతంగా ఆమెకు మద్యం తాగించినట్లు పోలీసులు గతంలో పేర్కొన్నారు. నిందితులు సైతం బాధితురాలికి మద్యం తాగించినట్లు తమ వాంగ్మూలంలో వెల్లడించినట్లు అధికారులు రిమాండ్ డైరీలో నమోదు చేసుకున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు సైతం నిర్ధారించారు. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని రిపోర్టులో వెల్లడించారు. నిందితులు పోలీసులకు చెప్పిన విషయం ఈ రిపోర్టు ధృవీకరించినట్లైంది.

దిశను తొండుపల్లి టోల్ గేట్ నుంచి తీసుకెళ్లిన నలుగురు నిందితులు, హత్యాచారానికి పాల్పడే సమయంలో ఆమెనోట్లో బలవంతంగా మద్యం పోసినట్లు పోలీసుల ముందు వెల్లడించారు. వారు చెప్పిన దానికి ఇప్పటివరకు సరైన ఆధారం లేకుండాపోయింది. ఇప్పుడు నిపుణులు ఇచ్చే ఫోరెన్సిక్ రిపోర్టుతో బలం చేకూరనుంది. దీనికితోడు నిందితులు రన్ వే 44 వైన్స్ లో మద్యం కొనుగోలు చేసిన సీసీఫుటేజ్ ను పోలీసులు సేకరించారు.

దిశ అత్యాచారం, హత్య అనంతరం నలుగురు నిందితులు డెడ్ బాడీని కాల్చివేయడంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించకుండా పోయాయి. అయితే నలుగురు ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసిన నేపధ్యంలో పోలీసులు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.

మరోవైపు దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags

Read MoreRead Less
Next Story