పర్యాటక ప్రాంతం లంబసింగిలో ప్రమాదకరంగా రోడ్లు

పర్యాటక ప్రాంతం లంబసింగిలో ప్రమాదకరంగా రోడ్లు

lambasingi

విశాఖ ఏజెన్సీలో పర్యాటక కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన ప్రాంతం లంబసింగి. ఇక్కడి మంచు అందాలు.. పరచుకున్నట్లు ఉండే పచ్చని కొండకోనలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఈ అందమైన ప్రాంతాలను తిలకించి, పులకించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. అయితే ఇంత ప్రాముఖ్యత కల్గిన ఈ ప్రాంతంలో రోడ్డుపరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. సుందర దృశ్యాలను చూసేందుకు వచ్చే జనాన్ని... మరణానికి దగ్గరచేసేలా మారాయి. ఈ రోడ్లమీద ప్రయాణించాలంటే ఓ రకంగా సాహస క్రీడలో పాల్గొన్నట్లు భావించాల్సిందే. దీంతో పర్యాటకులతోపాటు స్థానికులు రోడ్ల దుస్థితిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ ప్రాంతానికి ఒడిశా దగ్గర కావడంతో అక్కడి నుంచి వచ్చే వ్యాపారులు, ఇతర పనులమీద వచ్చేవారంతా ఈ మార్గం గుండానే ప్రయాణించి, సరుకులను తరలిస్తుంటారు. వీరితోపాటు ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఈ దారిలోనే వెళుతుంటారు. ఆర్టీసి బస్సులు, పెద్దట్రాన్స్ పోర్టు వాహనాలు వస్తున్నాయంటే చాలు ప్రయాణికులు ఒకింత భయాందోళకు గురవుతుంటున్నారు. రోడ్లు సరిగాలేక, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతుకుల రోడ్లపై ప్రయాణించడం వల్ల తమ వాహనాలు సైతం సర్వీసుకు వస్తున్నాయని వాహనదారులు అంటున్నారు.

గూడెం కొత్తవీధి నుంచి సీలేరు వెళ్లే మార్గానిది ఇదే పరిస్థితి. జీకే వీధినుంచి సీలేరుకు 3గంటలు పట్టే ప్రయాణానికి రోడ్లు పాడవడంతో ఏకంగా 5 గంటల సమయం పడుతుందని ప్రాయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత్రివేళల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని అంటున్నారు. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతానికి వెళ్లే రోడ్లు పూర్తిగా కంకరతేలి.. మోకాలు లోతు గుంతలు ఏర్పడినా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లువేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story