కీలక అంశాలపై ఫోకస్‌ చేసిన అధికార పార్టీ

కీలక అంశాలపై ఫోకస్‌ చేసిన అధికార పార్టీ

cm-jagan

తొలి రోజు నుంచి వాడి వేడిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు.. సెలవు తర్వాత మళ్లీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరో రెండు రోజులే మిగిలి ఉండటంతో కీలక అంశాలపై చర్చకు ఫోకస్ చేసింది అధికార పార్టీ. దాదాపు 11 కీలక బిల్లులపై సోమవారం చర్చించే అవకాశాలున్నాయి. దిశా బిల్లు ఆమోదం..జనంలో దాని ప్రభావంపై కూడా సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 20 అంశాల్లో చర్చించాలని అధికార పార్టీ భావిస్తుంటే.. ప్రతిపక్ష సభ్యులు ప్రజల నిత్యావసరాలు, పెరిగిన ధరలను హైలెట్ చేసే అవకాశాలున్నాయి.

సోమవారం సభ ముందుకు రానున్న పదకొండు బిల్లుల్లో ఎక్సైజ్ చట్టం ఉంది. లిక్కర్ కొనాలంటేనే షాక్ తగిలేలా ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయానికి ఈ కొత్త చట్టంలో సవరణలు చేయనున్నారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయించినా, తయారుచేసినా కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, భారీగా జరిమానాలు విధించేలా కూడా ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేయనున్నారు. ఇక వేల మంది ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను నెరవేర్చేలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ - అబ్జార్పషన్ ఆఫ్‌ ఎంప్లాయిస్‌ ఆఫ్‌ APSRTC ఇన్‌ టు గవర్నమెంట్‌ సర్వీసు యాక్ట్‌–2019 బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.

రైతులకు మేలు చేకూర్చేలా చిరు, పప్పు బోర్డులను ఏర్పాటు చేసేందుకు వీలుగా కొత్త చట్టం రూపొందించేందుకు బిల్లును సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. చిరు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడం, ఆ పంటలకు మద్దతు ధర కల్పించడం ఈ బోర్డుల ఏర్పాటు లక్ష్యం. కర్నూలులో సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్‌ గవర్నమెంట్‌ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీల చట్టంలో సవరణ చేసే అవకాశాలున్నాయి.

వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. ఇందుకోసం కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఏర్పాటుకు సంబంధించి జవహర్‌లాల్‌ నెహ్రూ అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ చట్టంలో సవరణ చేయాలని భావిస్తోంది. ఏపీ ట్యాక్స్‌ ఆన్‌ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టంలో సవరణ చేపట్టనున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలిఉండటంతో ప్రతిపక్షం కూడా ప్రజా సమస్యలపై మరింత బలంగా తమ వాయిస్ వినిపించాలని భావిస్తోంది. రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై సభలో ప్రస్తావనకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. దిశా చట్టం ఆమోదం తర్వాత కొన్ని గంటల్లోనే అత్యాచార ఘటనలు చోటు చేసుకోవటంపై ప్రతిపక్షం ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తోంది. దిశా చట్టం అమలు తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలున్నాయి. అలాగే పెరుగుతున్న నిత్యావసర ధరలను కూడా సభలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story