అప్పుల కోసం ఏపీ సర్కారు తిప్పలు

అప్పుల కోసం ఏపీ సర్కారు తిప్పలు

jagan

అప్పుల కోసం ఏపీ సర్కారు తిప్పలు పడుతోందా? రుణాలు ఇచ్చేందుకు రుణ సంస్థలు ససేమీరా అంటున్నాయా? ఏపీ ఆర్థిక పరిస్థితి చూసి.. బ్యాంకులు, రుణసంస్థలు ఒక్కొక్కటిగా వెనకంజవేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస యోజనకు అనుసంధానంగా.. నిర్మిస్తున్న ఇళ్ల పథకం కూడా సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.

ఓవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయింది. మరోవైపు రాష్ట్రంలో రాబడి మందగించడంతో.. ఆర్ధిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఈ పరిస్థితిని గమనిస్తున్న రుణసంస్థలు, బ్యాంకులు అప్పులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే రుణం ఇవ్వలేమని SBI చేతులెత్తేస్తే.. తాజాగా హడ్కో సైతం ఇదే మాట చెప్పింది. ఇప్పుడు LIC సైతం.. ఏపీకి రుణం ఇవ్వాలా? వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయిందట.

రాష్ట్రంలో పాతిక లక్షల ఇళ్లను పేదలకు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ప్రధాన మంత్రి ఆవాస యోజనకు అనుసంధానంగా రాష్ట్ర సర్కారు కూడా కొంత ఆర్ధికభారాన్ని మోస్తూ ఈ నిర్మాణాలను చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం 69 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కేంద్రం తన వాటాగా 40 వేల కోట్లు భరిస్తుండగా.. మిగిలిన 29 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఈ ఇళ్ల నిర్మాణాల కోసం 45 వేల ఎకరాల భూమి అవసరమని లెక్కలేశారు. ఇప్పటికే 21 వేల ఎకరాలను సేకరించగా.. మిగిలిన 24 వేల ఎకరాలను సమీకరించాల్సి ఉంది. ఇందుకోసం15 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. నివేదికలు సైతం సిద్ధం చేశారు అధికారులు. 5 వేల కోట్ల సొంత నిధులతో పాటు మరో 10వేల కోట్లను రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఈ రుణం కోసం LICతో గతంలో సంప్రదింపులు జరిపింది ప్రభుత్వం. స్వయంగా సీఎం జగన్‌.. ఉన్నతాధికారులతో చర్చించారు. దీంతో గృహనిర్మాణపథకానికి రుణం ఇచ్చేందుకు అప్పట్లో అంగీకరించింది LIC. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన ఆ సంస్థ ఇప్పుడు రుణం ఇచ్చేందుకు తర్జనభర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. LICతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు ఏపీ ఉన్నతాధికారులు. ఒకవేళ రుణం

ఇచ్చేందుకు నిరాకరిస్తే.. గృహనిర్మాణ పథకం డోలాయమానంలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story