కరేబియన్ ధాటికి చేతులేత్తేసిన టీమిండియా

కరేబియన్ ధాటికి చేతులేత్తేసిన టీమిండియా

india-vs-wi

రికార్డ్ సిరీస్ విజయాన్ని టార్గెట్ గా నిర్దేశించుకున్న కోహ్లీ టీంకు వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లోనే పరాభవం ఎదురైంది. టీ ట్వంటీలో కరేబియన్ జట్టును అలవోకగా ఆడేసుకున్న ఇండియన్ ప్లేయర్స్ కి చెన్నైలో లెక్క తప్పింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి చెప్పుకోదగిన స్కోరును సాధించినా.. విండీస్ బ్యాట్స్ మెన్ హెట్మెయిర్ ధాటికి టీమిండియా చేతులేత్తేసింది.

288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్..ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 9 పరుగులు చేసిన ఓపెనర్ అంబ్రిస్‌ వికెట్‌ను కోల్పోయింది. కానీ, వికెట్ తీసిన సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. అంబ్రిస్ స్థానంలో వచ్చిన హెట్మెయిర్..సునామీ ఇన్సింగ్స్ తో చెలరేగిపోయాడు. 7 సిక్స్‌లు, 11 ఫోర్లు బాదేశాడు. 106 బంతుల్లో 139 పరుగులు చేసి విండీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అతి తక్కువ ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు.

మరో ఎండ్ లో ఓపెనర్ హోప్ కూడా సెంచరీతో రాణించాడు. ఓపెనర్ గా వచ్చిన హోప్ చివరి వరకు క్రీజులో కొనసాగి నాటౌట్ గా నిలిచాడు. 151 బాల్స్ ఆడి 7 ఫోర్లు, ఓ సిక్సర్ తో 102 రన్స్ చేశాడు. హెట్మెయిర్, హోప్ కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం అందించటంతో విండీస్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఈ సమయంలో హెట్మెయిలర్ ఔట్ అవటంతో క్రీజులోకొచ్చిన నికోలస్ పూరన్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 48వ ఓవర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. కోహ్లీ, రాహుల్ నిరాశపరిచినా మిడిలాడర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ చెరో హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. శ్రేయస్ అయ్యర్ 70 పరుగులు చేస్తే, పంత్ 71 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

చెన్నై వన్డే విజయంతో మూడు మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక 18న విశాఖలో రెండో వన్డే జరగనుంది. సెకండ్ వన్డే కోసం ఇప్పటికే టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో విశాఖ క్రికెట్ ఫీవర్ లో మునిగిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story