కరేబియన్ టీంను బెంబేలెత్తించిన టీమిండియా

కరేబియన్ టీంను బెంబేలెత్తించిన టీమిండియా

ind-vs-wi

విశాఖ వన్డేలో టీమిండియా అల్ రౌండ్ షోతో అదరగొట్టేసింది. బ్యాటింగ్ తో కరేబియన్ టీంను బెంబేలెత్తించింది. బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఎటొచ్చి ఫీల్డింగ్ లో మాత్రం ఇంకా కుదుటపడకున్నా..అద్భుత విజయం ముందు అది చిన్న విషయంగా మారిపోయింది. సెంచరీ హీరోస్ రోహిత్, రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ కు శ్రేయర్ అయ్యర్, రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ తోడవటంతో టీమిండియా రన్స్ రేస్ దూసుకుపోయింది. 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది.

రోహిత్ శర్మ వికెట్ల దగ్గర స్టాండ్ అయితే బీభత్సం ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. 159 పరుగులతో కేరీర్ లో మరో సెంచరీ క్రెడిట్ అయ్యింది. మరో ఎండ్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ 102 పరుగులతో రాణించాడు. వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్‌కు 227 రన్స్ జోడించారు.

డకౌట్ గా పెవిలియన్ చేరిన కెప్టెన్ కోహ్లీ నిరాశపరిచినా..చివర్లో శ్రేయాస్ అయ్యర్, రిషబ్‌ పంత్‌ మెరుపువేగంతో బ్యాటింగ్ చేసి..జట్టుకు భారీ స్కోరు అందించారు. అయ్యర్ 32 బంతుల్లో 53 రన్స్ చేస్తే..రిషబ్ పంత్ 16 బంతుల్లోనే 39 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 47వ ఓవర్లో... అయ్యర్ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు.. నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌ ఏకంగా 31 రన్స్ రాబట్టాడు. అంతకుముందు ఓవర్లోనే 24 పరుగులు పిండేశారు. ఈ రెండు ఓవర్లలోనే 55 పరుగులు సాధించి టీం స్కోరును దౌడు తీయించారు.

ఆ తర్వాత టార్గెట్ చేజింగ్ కు దిగిన విండీస్ 388 పరుగలు భారీ లక్ష్యం ముందు డీలా పడిపోయింది. టాప్ ఆర్డర్ క్రీజులో ఉన్నంత సేపు కంగారు పెట్టించారు. 75 రన్స్ తో నికోలస్, 78 పరుగులతో షై హోప్ వికెట్ల దగ్గర స్టాండింగ్ తీసుకోవటంతో వికెట్ల పతనం ఆలస్యమైంది. అయితే..33వ ఓవర్లో కుల్దీప్ హ్యాట్రిక్ వికెట్ విండీస్ పరాజయాన్ని ఖాయం చేసింది. వన్డేల్లో కుల్దీప్ కు రెండో హ్యాట్రిక్ వికెట్. ఆ తర్వాత విండీస్ పతనంలో వేగం పుంజుకుంది. చివర్లో పియర్, కీమో పాల్ పోరాటంతో ఓటమిని కాసేపు అడ్డుకోగలిగినా..44 ఓవర్లో విండీస్ 280 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను 1-1 తో సమం చేసింది కోహ్లీ టీం.

Tags

Read MoreRead Less
Next Story