ఐపీఎల్ 2020 వేలం.. ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు..

ఐపీఎల్ 2020 వేలం.. ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు..

ipl

సమ్మర్ లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే పొట్టి క్రికెట్ ధమాకా మళ్లీ మొదలైంది. ఐపీఎల్ 2020 వేలానికి రంగం సిద్ధమైంది. ఓవైపు పౌరసత్వ బిల్లుపై నిరసన సెగల మధ్యే కోల్ కతాలో గురువారం వేలం పాట జరుగనుంది. మరికొద్ది గంటల్లో జరుగనున్న వేలంపాటకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అంతర్జాతీయ స్టార్ల నుంచి దేశవాళీ చిచ్చరపిడుగుల వరకు.. వందల సంఖ్యలో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఈసారి ఐపీఎల్ వేలంలో పలు సంచలనాలు నమోదు కావొచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కొందరు కీలక ఆటగాళ్లు జట్టు మారే అవకాశం వుండగా.. మరికొందమందికి కొన్ని జట్లు ఉద్వాసన పలికే సూచనలు కనబడుతున్నాయి. ఇక, కీలక ఆటగాళ్లపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్, క్రిస్ లిన్, మిచెల్‌ మాల్స్, పాట్ కమిన్స్, జొస్ హాజల్‌వుడ్‌లకు అత్యధిక ధర లభించే అవకాశముంది. విండీస్‌ బిగ్‌ హిట్టర్‌.. ప్రస్తుతం ఇండియా టూర్ లో ఇరగదీస్తున్న షిమ్రన్‌ హెట్‌మైర్‌తో పాటు మీడియం పేసర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేశాయి.

ఇక, దేశవాళీల్లో అదరగొట్టిన అండర్-19 కెప్టెన్ ప్రియం గార్గ్, యశస్వి జైస్వాల్‌, ఆర్‌. సాయి కిషోర్‌ లాంటి యువ ఆటగాళ్లపైనా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. బెంగాల్‌ పేసర్‌ ఇషాన్‌ పోరెల్‌ పై భారీ అంచనాలున్నాయి. వీరి కనీస ధర 20 లక్షలు. ఇక, రాబిన్‌ ఊతప్ప, యూసఫ్‌ పఠాన్‌, పియూష్‌ చావ్లా, ఉనాద్కట్‌ లాంటి భారత సీనియర్లు కూడా వేలానికి అందుబాటులో ఉన్నారు.

ఈసారి వేలంలో కొందరు కుర్రాళ్లపై ఫ్రాంచైజీలు భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందరికన్నా చిన్నవాడైనా అఫ్గనిస్థాన్‌ చిన్నోడు నూర్‌ అహ్మద్‌ ఫ్రాంచైజీలను అమితంగా ఆకర్షిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం చైనామన్‌ బౌలర్‌ వయసు కేవలం 14 ఏళ్లే. ఇటీవల భారత్‌తో జరిగిన అండర్‌-19 సిరీస్‌లో నూర్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు. నూర్‌ కనీస ధర 30 లక్షలు.

బౌలర్లు సైతం బాట్స్ మెన్ తో సమానంగా పోటీపడుతున్నారు. శ్రీలంక సీనియర్‌ ప్లేయర్‌ ఏంజెలో మాథ్యూస్‌, సఫారీ పేసర్‌ స్టెయిన్‌ ప్రారంభ ధర 2 కోట్లుండగా.. వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయా అనేది చూడాలి. టెస్టు ఆటగాళ్లు హనుమ విహారి, ఛతేశ్వర పుజారా 50 లక్షల మినిమమ్ ప్రైస్ తో వేచిచూస్తున్నారు.

ఈసారి మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో 73 మంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం వుంది. ఇందులో విదేశీ 29 మంది విదేశీ క్రికెటర్లకు ఛాన్సుండగా.. మిగతా 44 మంది దేశీయ ఆటగాళ్లుంటారు. ఇక, ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీలో గరిష్టంగా 25 మందిని తీసుకోవచ్చు. ఇదిలావుంటే, ఈసారి బెంగళూరు జట్టు అత్యధికంగా 12 మందిని తీసుకునే ఛాన్సుంది. ఇందుకోసం ఏకంగా 322 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

ఈసారి వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది ఎంపికయ్యారు. వీరిలో 13 మంది భారతీయులతో సహా.. 134 మంది ఇంటర్నేషనల్‌ క్రికెట్ అనుభవం వుంది. 198 మంది కొత్త కుర్రాళ్లు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఇక, కింగ్స్ లెవన్ పంజాబ్ వద్ద అధికమొత్తంలో డబ్బుంది. ఈ ఫ్రాంచైజీ రూ.42.70 కోట్లతో టాప్ లో వుంది. దాదాపు రూ.28 కోట్లు ఖర్చు చేసేందుకు బెంగళూరు ఫ్రాంచైజీ సిద్ధంగా వుంది. కోల్ కతా నైట్ రైడర్స్ రూ.35.65 కోట్లతో రెండోస్థానంలో వుంది. రాజస్థాన్‌ రాయల్స్ దగ్గర రూ.28.90 కోట్లు, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.27.90 కోట్లున్నాయి. ఇక, ఢిల్లీ దగ్గర రూ.27.85 కోట్లుంటే.. మన సన్ రైజర్స్ వద్ద రూ.17 కోట్లున్నాయి. ఇక, రూ.14.60 కోట్లతో చెన్నై.. రూ.13.05 కోట్లతో ముంబయి ఫ్రాంచైజీలు స్థానాల్లో వున్నాయి. ఏదేమైనా ఈసారి డబ్బు తక్కువగా వుండటంతో.. ఫ్రాంచైజీలు ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.

Read MoreRead Less
Next Story