దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు

దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు

cabపౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కారణంగా ఢిల్లీ-గుర్గావ్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

బెంగుళూరులోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. పలు సంఘాలు నల్ల జెండాలతో ఆందోళనకు దిగాయి. నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రజా సంఘాలు, ముస్లిం సంస్థలు నిరసనలు చేపడుతున్నాయి.

కర్ణాటక కల్బుర్జిలోనూ.. ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెంగుళూరులో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం అర్థరాత్రి వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని సిటీ పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పంజాబ్‌లోనూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తారస్థాయికి చేరాయి. చండీగఢ్‌లో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో సిటిజెన్‌ అమెండ్‌మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story