మూడు రాజధానుల ప్రతిపాదనపై మాజీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం

మూడు రాజధానుల ప్రతిపాదనపై మాజీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం

akhila-priya

ఏపీ రాజధాని మార్పు.. జి.ఎన్‌ రావు కమిటీపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.. కేవలం రాజధాని రైతులు.. సామాన్యులే కాదు.. రాజకీయ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అసెంబ్లీలో జగన్‌ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినప్పటి నుంచే.. టీడీపీ ఆ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ఇప్పుడు రాజధాని రైతులు చేపట్టిన దీక్షలకు టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, శ్రవణ్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు. టీడీపీ రాజధాని రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

మూడు రాజధానుల ప్రతిపాదనపై మాజీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని మరింత అభవృద్ధి చేయాల్సిన జగన్.. విభజించి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. తుపాన్‌ల ముప్పు వుండే విశాఖను ఎలా రాజధాని చేస్తారని ఆమె ప్రశ్నించారు..

ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ప్రశ్నించారు.. జగన్‌ నాయకత్వంలో రాజధాని మార్పు అనేది అభివృద్ధికి మంచిది కాదని విమర్శించారు. సీఎంగా జగన్‌ హాయంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించడం కలగానే మిగులుతుందన్నారు కన్నా. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప.. పరిపాలన వికేంద్రీకరణ కాదన్నారు కన్నా..

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసేలా వున్నాయని అన్నారు బీజేపీ మహిళానేత పురంధేశ్వరి. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆమె రాజధాని రైతులతో భేటీ అయ్యారు. రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు.

ఏపి రాజధాని విషయంలో జిఎన్ రావు నివేదికపై రాయలసీమ వాసులు తీవ్ర అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ఏర్పాటు చేసే హైకోర్టుతో సమాన్యులకు ఎలాంటి లాభం లేదని జిల్లా వాసులు అంటున్నారు. పాలకులు ఇప్పటికైనా తమ పద్దతి మార్చుకోకపోతే ప్రత్యేక రాయలసీమకై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. జీఎన్‌ రావు కమిటీతో రాయలసీమకు 60 శాతమే న్యాయం జరిగిందన్నారు బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేశ్‌.

ఏపీలో రాజధాని కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌ రావు కమిటీ బోగస్ అన్నారు బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి. దానికి జగన్‌ మోహన్‌ రెడ్డి కమిటీ పేరు పెడితే బాగుండేదని అన్నారాయన. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని.. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఇష్టమొచ్చినట్టే చేస్తుంటే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

రాజధాని మూడు చోట్ల ఉండాలన్న జగన్‌ నిర్ణయంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని.. ఇప్పుడు మరిన్ని కష్టాలు తప్పవన్నారు..

బీజేపీ అధ్యక్షుడు సహా కీలక నేతలంతా మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తుంటే.. జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన సిఫార్సులను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ వల్ల ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

వైసీపీ మంత్రులు, నేతలు మాత్రం మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అంటున్నారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే మూడు రాజధానులు పెట్టడం జరిగిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. విశాఖ రాజధానిని చేయడంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి అవంతి.

మొన్నటి వరకు ఇసుక కొరత, ఇంగ్లీష్‌ మీడియం తదితర అంశాలతో ఏపీ దద్దరిల్లింది.. ఇప్పుడు రాజధానిపై జి.ఎన్‌ రావు కమిటీ నివేదికతో రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలు ఎగిసి పడుతుండడతో.. త్వరలో జరిగే కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story