రగులుతున్న అమరావతి.. మంత్రులు ప్రకటనతో గందరగోళం

రగులుతున్న అమరావతి.. మంత్రులు ప్రకటనతో గందరగోళం

amaravati

రాజధానిలో ఆందోళలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. రాజధాని ఇక్కడి నుంచి తరలించొద్దంటూ అమరావతి వాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రాజధాని రైతులు.. ఇవాళ కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 29 గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. జగన్‌ ప్రభుత్వ తీరుపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. మందడంలో ప్రధాన రహదారిని దిగ్బంధించి రైతులు రోడ్డుపై బైటాయించారు. రోడ్డుపై పడవ పెట్టి నిరసన కొనసాగిస్తున్నారు. అటు ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో వంటావార్పుతో నిరసనకు సిద్ధమవుతున్నారు.తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్ద పరిమి గ్రామాల్లో మహాధర్నా చేపట్టారు. మరోవైపు వెలగపూడిలో ఐదో రోజు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు రైతులు. రాజధాని ఉద్యమంతో 29 గ్రామాలు వేడెక్కాయి. పార్టీలకతీతంగా ఒక్కటైన జనం.. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులంతా రోడ్డెక్కారు. తమ భవిష్యత్‌ ఏంటి అంటూ చివరికి చిన్న పిల్లలు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. తమ భవిష్యత్‌ను ప్రభుత్వం నాశనం చేస్తోందని అంటున్నారు. రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. 5 కోట్ల ఆంధ్రుల కోసం తాము భూములను త్యాగం చేస్తే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తమ పొట్ట కొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము భూములను ప్రభుత్వానికి ఇచ్చాం తప్పా.. పార్టీలకు కాదని అంటున్నారు. జగన్‌కు ఓటేసి మోసపోయామని వాపోయారు. రాజధాని తరలిస్తే తమకు ఉరితాళ్లే శరణ్యమంటున్నారు రాజధాని రైతులు. ఇంత జరుగుతున్నా.. తమ ఓట్లతో గెలిచిన స్థానిక నేతలు ఎవరూ మద్దతు తెలపకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు రాజధానిలో రైతులు తీవ్ర ఉద్యమం చేస్తుంటే.. అటు వైసీపీ మంత్రులు, నేతలు ఒక్కొక్కరు ఒక్కో ప్రకటనతో మరింత గందర గోళానికి గురి చేస్తున్నారు. రైతుకు భరోసా ఇవ్వాల్సిన నేతలు.. రాజధానిపై ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో రాజధాని రైతులు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు. తాము చేసిన త్యాగాలను దారుణంగా అవమానిస్తున్నారని.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తాము అసలు ఈ రాష్ట్రంలోనే ఉన్నామా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలానే బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తే రాష్ట్రం విభజనకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రైతు కంట కన్నీరు పాలకులకు మంచిది కాదంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story