కమలం గూటి నుంచి జారిపోయిన ఝార్ఖండ్

కమలం గూటి నుంచి జారిపోయిన ఝార్ఖండ్

mosha

ఓ ఆర్నెళ్ల క్రితం హస్తం పార్టీని అథ:పాతాళానికి తొక్కేసి.. బంపర్ మెజారిటీతో రెండోసారి ఢిల్లీ పీఠంపై పాగావేసింది బీజేపీ. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీని ఖాతా తెవరనీయకుండా చేసి.. 14 లోక్ స్థానాల్లో ఏకంగా 11 సీట్లను ఎగరేసుకుపోయింది. కానీ, ఆర్నెళ్లు తిరిగేసరికి అదే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. అధికారానికి చేరువ కాలేకపోయింది. లోక్ సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ - జేఎంఎం - ఆర్జేడీ కూటమి కమలనాథులు షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నిక ఫలితాలే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని భావించిన కమలనాథుల ఆశలపై.. ఝార్ఖండ్ ఓటర్లు నీళ్లు చల్లారు.

ఝార్ఖండ్ ఓటర్లు లోక్ సభ ఎన్నికలకు భిన్నంగా తీర్పునిచ్చారు. జాతీయ అంశాలు, స్థానిక విషయాలను ఝార్ఖండ్ ఓటర్లు వేరుగా చూశారు. అందుకు తగ్గట్టుగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయోధ్య భూవివాద పరిష్కారం, రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలేవీ ఝార్ఖండ్ ఓటర్లపై ప్రభావం చూపించలేదన్నది స్పష్టమవుతోంది. అవేవీ తమకు అక్కర్లేదని.. స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనే తమకు ముఖ్యమని ఝార్ఖండ్ ఓటర్లు తేల్చేశారు. స్థానిక అంశాలను పరిష్కరించడంలో రఘుబర్ దాస్ సర్కార్ వైఫల్యమే.. బీజేపీ కొంప ముంచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఝార్ఖండ్ ఎపిసోడ్ తో బీజేపీ పరాజయ పర్వంలో మరో రాష్ట్రం చేరినట్టయింది. ఇటీవలికాలంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. గడిచిన రెండేళ్లలో బీజేపీ ఐదు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఆ పార్టీ ఓటమిపాలైంది. మూడు పెద్ద రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకుంది. ఈ ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. కమలనాథులకు చావు తప్పి కన్ను లొట్టబోయింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానాలో చివరి నిమిషంలో దుష్యంత్ చౌతాలా చేయి అందించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే, హర్యానా కూడా హస్తగతమయ్యేదే. ఇక, ఇటీవల జరిగిన మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కార్ కు కష్టాలు తప్పలేదు. చిరకాల మిత్రపక్షం శివసేన హ్యాండివ్వడంతో.. మరాఠా నేలపై కమలం వాడిపోయింది. పొలిటికల్ హైడ్రామా మధ్య ఉద్ధవ్ ఠాక్రే అధికారం చేపట్టారు.

మరోవైపు, గతేడాది మేలో కర్నాటక పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకుంది బీజేపీ. మరోసారి యడ్యూరప్పకు పగ్గాలు అప్పగించింది. అయితే, కాంగ్రెస్-జేడీఎస్ పొలిటికల్ గేమ్ తో రెండు రోజల్లోనే బీజేపీ సర్కార్ కుప్పకూలింది. అయితే, ఆపరేషన్ కమల్ తో కాంగ్రెస్ - జేడీఎస్ సర్కార్ పతనం కాకతప్పలేదు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని కన్నడ పీఠాన్ని పక్కా చేసుకుంది బీజేపీ.

ఇక, తాజాగా ఝార్ఖండ్ లో జరిగిన ముఖాముఖి పోరులో బీజేపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ జట్టుకట్టడంతో.. కమలం పార్టీ చతికిలబడింది. రెండోసారి అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. మొత్తానికి, ఝార్ఖండ్ ఎపిసోడ్ తో.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మూడడుగులు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది.

Tags

Read MoreRead Less
Next Story