ఓ వైపు కేబినెట్ సమావేశం.. మరోవైపు ఆందోళనలు

ఓ వైపు కేబినెట్ సమావేశం.. మరోవైపు ఆందోళనలు

jagan-cabinate

ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని, రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏర్పాటు అయిన జీఎన్ రావు కమిటీ నివేదికపైనే చర్చించనున్నారు. అయితే.. రాజధాని తరలింపుపై శుక్రవారం తుది నిర్ణయం ఉండకపోవచ్చంటున్నారు మంత్రులు. రాజధానితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపైనా కేబినెట్‌లో చర్చ జరగనుంది. రాజధాని ప్రాంతంలో ఆందోళనల పైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రైతులతో చర్చించేందుకు ఓ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు బుగ్గన, కన్నబాబు, బొత్స, నారాయణస్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులకు ఎలా న్యాయం చేయాలనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించనుందని తెలుస్తోంది. రైతులకు భారీ ప్యాకేజీ సహా ఇతర వరాలపై ప్రభుత్వానికి ఈ కమిటీ పలు సూచనలు చేయనుంది. ఇక అసైండ్ భూములపై ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. సివిల్ సర్వీసెస్‌ అధికారులకు రిజిస్ట్రేషన్ చేసిన భూముల విషయంపైనా ఓ నిర్ణయానికి రానుంది. వారు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చి, వారు చేయించుకున్నరిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం వుంది.

కేబినెట్‌ భేటీ నేపథ్యంలో అమరావతి పోలీసుల వలయంలోకి వెళ్లింది. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మందడంలో ఎటూ చూసిన పోలీసులే కనిపిస్తున్నారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో మందుల దుకాణాలు తప్పా మిగతా షాపులు అన్ని మూయించారు.

అమరావతిలో పోలీసుల్ని భారీగా మోహరించడంపై మండిపడుతున్నారు అమరావతి రైతులు. రాజధానిని తరలించాలనే తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే పోలీసులతో తమను నిర్భందించారంటున్నారు. కేబినెట్‌లో అమరావతి రాజధానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటున్నారు రాజధాని రైతులు.

అటు విజయవాడలో మంత్రి బొత్స ఇంటిని ముట్టడించారు TNSF నేతలు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యల్ని నిరసనస్తూ ఆందోళనకు. బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో TNSF నేతల్ని అరెస్ట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story