అమరావతి భవిష్యత్‌ను తేల్చే కీలక భేటీ

అమరావతి భవిష్యత్‌ను తేల్చే కీలక భేటీ

jagan-cabinate

అమరావతి భవిష్యత్తును తేల్చే కీలకమైన మంత్రివర్గ సమావేశం శుక్రవారం జరగబోతోంది. రాజధాని అంశమే ప్రధాన ఎజెండాగా జరగనున్న ఈ భేటీలో GNరావు కమిటీ ఇచ్చిన నివేదికపై సమగ్రంగా చర్చించనున్నారు. ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. సచివాలయంలో భేటీ నిర్వహిస్తే రాజధాని ప్రాంత రైతుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సచివాలయంలో నిర్వహించాలా? లేక సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలా? అన్న అంశంపై అధికారులు చర్చలు జరిపారు.

రాజధాని, రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏర్పాటు అయిన జీఎన్ రావు కమిటీ నివేదికపైనే కేబినెట్‌లో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ రిపోర్టును మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపైనా కేబినెట్‌లో చర్చ జరగనుంది. అటు రాజధాని ప్రాంతంలో ఆందోళనలనలపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రైతులతో

చర్చించేందుకు ఓ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు బుగ్గన, కన్నబాబు, బొత్స, నారాయణస్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులకు ఎలా న్యాయం చేయాలనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించనుందని తెలుస్తోంది. రైతులకు భారీ ప్యాకేజీ సహా ఇతర వరాలపై ప్రభుత్వానికి ఈ కమిటీ పలు సూచనలు చేయనుంది. ఇక అసైండ్ భూములపై ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. సివిల్ సర్వీసెస్‌ అధికారులకు రిజిస్ట్రేషన్ చేసిన భూముల విషయంపైనా ఓ నిర్ణయానికి రానుంది. వారు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చి, వారు చేయించుకున్నరిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం వుంది.

మరోవైపు కేబినెట్ సమావేశానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. సచివాలయం వైపు ఆందోళనకారులు రాకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కొత్త వారిని ఇళ్లలో ఉండనివ్వొద్దని, ఆందోళనలు చేపట్టొద్దని ఇప్పటికే పోలీసులు మందడం గ్రామ ప్రజలకు నోటీసులు ఇచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆందోళనలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ర్యాలీలపైనా నిషేధం విధించారు. సచివాలయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సెక్రటరియేట్‌కు వెళ్లే దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి వచ్చే రహదారిలో ఆంక్షలు విధించారు. కేబినెట్‌ సమావేశం ముగిసే వరకు ఎవరినీ అనుమతించరు. ఆంక్షలు మీరితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story