తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు.. మరోసారి పోస్టుమార్టం

తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు.. మరోసారి పోస్టుమార్టం

ayesa-meera

ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ తెరపైకి వస్తోంది. శనివారం మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయేషా తల్లిదండ్రులకు తెలియజేశారు. దాదాపు పుష్కర కాలం తర్వాత సీబీఐ టేకప్‌ చేయడం, శవపరీక్షకు సిద్ధం కావడం హాట్ టాపిక్ అయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడు ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీనే. వాస్తవాలను వెలికి తీసేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దీంతో.. ఆధారాల సేకరణకు కేంద్ర విచారణ బృందం అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తెనాలి వస్తున్నారు. ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఆయేషా తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షంషాద్‌ బేగం, ఇక్బాల్‌ భాషా కూతురు ఆయేషా. 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో బీఫార్మసీ చదువుతుండేది. స్థానిక హాస్టల్‌లో ఉండేది. 27 ఉదయం ఆమె రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. డిసెంబర్ 26 రాత్రే ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. అప్పట్లో విద్యార్థి, సామాజిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాయి. నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

సుమారు 8 నెలల తర్వాత నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబు సడెన్‌గా తెరపైకి వచ్చాడు. 2008లో ఆగస్టు 17న అతన్ని ఒక కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతను గతంలో ఇదే తరహా హత్యలు చేసేవాడని.. ఆయేషాను కూడా చంపినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు ఛార్జ్‌షీటు వేశారు. 2010 సెప్టెంబర్‌లో అతనికి యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది విజయవాడ మహిళ సెషన్స్ కోర్టు.

అయితే.. సత్యంబాబుతో పోలీసులే బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు హైకోర్టుకు చేరింది. సుదీర్ఘ విచారణ తర్వాత సత్యంబాబు నిర్దోషిగా బయటకొచ్చాడు. దీంతో అయేషా హంతకుడు ఎవరన్నది తేలలేదు. కేస్ మొదటికొచ్చింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఈసారి కేసును సీబీఐకి అప్పగించారు. నేర పరిశోధనలో భాగంగా.. ఆయేషా మృతదేహానికి 12 ఏళ్ల తర్వాత మరోసారి పోస్టుమార్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తెనాలి వస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story