చంద్రయాన్‌-2: విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని స్పష్టంగా గుర్తించిన నాసా

చంద్రయాన్‌-2: విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని స్పష్టంగా గుర్తించిన నాసా

chandrayn2

చంద్రయాన్‌-2 ప్రయోగం ఆఖరు దశలో ఫెయిల్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ ఊహించని రీతిలో చంద్రుడిపై కూలిపోయింది. అది ఎక్కడ, ఎందుకలా పడిపోయిందనే దానిపై ఇప్పటికే స్పష్టత వచ్చినా.. తాజాగా నాసా విడుదల చేసిన ఫొటోల్లో విక్రమ్ కూలిన ప్రాంతాన్ని స్పష్టంగా గుర్తించారు. నాసాకు చెందిన లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్-LRO కెమెరా తీసిన ఫొటోల్లో విక్రమ్ శకలాలు 24 చోట్ల పడినట్టు కనిపిస్తోంది. క్రాష్‌ సైట్‌కి 750 మీటర్ల దూరంలో కొన్ని ముక్కలు పడినట్టు కూడా నాసా చెప్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ఫొటోలో పచ్చ చుక్కలు స్పేస్ క్రాఫ్ట్‌కి సంబంధించిన శిధిలాలుగానూ.. నీలం రంగు డాట్స్‌ను మిగతా భాగాలుగానూ, అలాగే చంద్రుడిపై దెబ్బతిన్న నేలగానూ వివరిస్తోంది.

చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ప్రధానంగా మూడింటిని పంపించారు. ఒకటి ఆర్బిటార్ కాగా మరొకటి విక్రమ్ ల్యాండర్, మూడోది ప్రగ్యాన్‌ రోవర్. సెప్టెంబర్ 2న ఆర్బిటార్ నుంచి విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. అక్కడి నుంచి చంద్రుడివైపు ప్రయాణం చేస్తూ ల్యాండింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ఎర్త్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. సెప్టెంబర్‌7న క్రాష్ ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో ఈ ప్రయోగం విఫలం కావడంతో చంద్రుడిపై ఇది ఎక్కడ కూలిపోయిందన్నది తెలుసుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టింది. తాజాగా నాసా విడుదల చేసిన ఫొటోల్ని విశ్లేషిస్తే.. క్రాష్ ల్యాండింగ్ వల్ల విక్రమ్‌కి సంబంధించిన కొన్ని శకలాలు 750 మీటర్ల దూరంలో గుర్తించారు.

నాసా విడుదల చేసిన ఫొటోల ఆధారంగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రయత్నించారు. కానీ దీనిపై పూర్తి విశ్లేషణ చెన్నైకి చెందిన టెక్కీ షణ్ముగ సుబ్రమణియన్ అలియాస్ షాన్‌ మాత్రం చేయగలిగాడు. నిజానికి ఇతను మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ ప్రోగ్రామర్. కానీ చంద్రుడిపై ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. అందుకే వీటిపై పూర్తి పరిశోధన చేశాడు. LRO తీసిన ఫొటోలపై అతని రిపోర్ట్‌ను నాసా సైతం గుర్తించింది. తన ట్వీట్‌లో షణ్ముగ గురించి ప్రస్తావించింది. సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ క్రాష్ ల్యాండింగ్ తర్వాత.. సెప్టెంబర్ 17, అక్టోబర్ 14, 15 తేదీల్లోనూ, నవంబర్ 11న విడుదలైన ఫొటోలను కొన్ని వారాలపాటు అధ్యయనం చేశాడు. చివరికి విక్రమ్ ల్యాండర్‌ శకలాలను గుర్తించగలిగాడు. దీనిపై అమెరికా స్పేస్ ఏజెన్సీకి మెయిల్ చేయడం.. వారు తమ దగ్గరున్న సమాచారాన్ని ఈ రిపోర్ట్‌తో పోల్చి చూసుకుని విక్రమ్ కూలిన ప్రదేశాన్ని నిర్థారించారు. నాసా మూన్ మిషన్‌లో తాము విక్రమ్ పడిన ప్రాంతాన్ని గుర్తించామని, నీలం, పచ్చ రంగు డాట్స్‌ దాని శకలాలేనని పేర్కొంది. ఆ ఫొటోల్లో 2/2 పిక్సల్‌ సైజ్‌లో ఉన్నవి విక్రమ్ శకలాలేనని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story