రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు: కేసీఆర్

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు: కేసీఆర్

KK

తెలంగాణలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కొన్ని పార్టీలు హేళనగా మాట్లాడుతున్నాయని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ తర్వాత అద్భుతాలన్నీ కనబడతాయని హామీ ఇచ్చారు. తాను కలలుకన్న తెలంగాణ కళ్లముందు కనబడుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కేసులు వేస్తూ ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని కేసీఆర్‌ హెచ్చరించారు..

కరీంనగర్‌ ప్రాంతానికి పీడ తొలిగిపోయిందన్నారు సీఎం కేసీఆర్‌.. ఇకపై రైతులు నిశ్చింతగారెండు పంటలు పండించుకోవచ్చన్నారు. ప్రస్తుతం మానేరులో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నాయని.. అయినా కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమకు మాత్రమే రాష్ట్రంపై పూర్తి కమిట్‌మెంట్‌ ఉందని.. ఉద్యమకారుడిగా రాష్ట్ర అభివృద్ధికోసమే తాను పని చేస్తానని భరోసా ఇచ్చారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన ఆయన మొదట కాళేశ్వరం పథకంతో ఎత్తిపోసిన గోదావరి జలాలతో నిండుకుండలా మారిన మిడ్‌ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి జలహారతి ఇచ్చారు.

తరువాత వేములవాడ రాజన్న సన్నిధిలో కుంటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ దంపతులకు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేసీఆర్‌ వెంట మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story