మినిష్టర్ హరీష్ రావు.. కాదు.. కాదు.. మాస్టర్ హరీష్ రావు

మినిష్టర్ హరీష్ రావు.. కాదు.. కాదు.. మాస్టర్ హరీష్ రావు

hari

అసెంబ్లీలో విపక్షాలు అడిగే లెక్కలకు టకాటకా సమాధానాలు చెప్పే ఆర్థిక మంత్రి హరీష్‌ రావు.. విద్యార్థులు చెప్పే సమాధానాలు విని షాక్‌కు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తీరుపై తనిఖీ కోసం వెళ్లిన ఆయనకు.. విద్యార్థుల పరిజ్ఞానం.. అధ్యాపకుల పనితీరు పరిశీలించాలి అనిపించింది. వెంటనే మాస్టర్‌ అవతారమెత్తి.. పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు.. వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. వారి సమాధానాలు విన్న మంత్రికి షాక్ తగిలింది.

సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం ‌అందిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. తరువాత పదో తరగతి గదికి వెళ్లి మాస్టారు అవతారమెత్తారు.

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో.. మ్యాథ్స్‌ సబ్జెక్టు‌లో‌ విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించాలనుకున్నారు మంత్రి. 17వ ఎక్కం‌ చెప్పమని పదో తరగతి విద్యార్థులను అడిగితే.. ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదు. కనీసం 12, 13 ఎక్కాలు కూడా చెప్పలేకపోయారు. తమకు పది ఎక్కాలు మాత్రమే నేర్పారని విద్యార్థులు చెప్పడంతో మంత్రి షాక్‌ అయ్యారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, లెక్కలు‌ చెప్పే టీచర్ పై అసంతృప్తి ‌వ్యక్తం‌ చేశారు.

తరువాత ప్రధానోపాధ్యాయుడితో పాటు కొందరి పేర్లు తెలుగు, ఇంగ్లీషు, ‌హిందీలో బోర్డు మీద రాసి చూపించమని కొందరు విద్యార్థులను పిలిచారు. ఎక్కువ మంది విద్యార్థులు తెలుగులోనూ ‌తప్పులు రాయడంతో మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తరువాత సోషల్‌సబ్జెక్టు నుండి కొన్ని ప్రశ్నలు వేశారు. రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానుల గురించి అడిగినా విద్యార్థుల నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో ఉపాధ్యాయులపై మంత్రి ఆగ్రహం ‌వ్యక్తం‌ చేశారు. ఇలా చదివితే పిల్లలు పదో తరగతి ఎలా పాసవుతారని ప్రశ్నించారు. ఈ పరిస్థితులు త్వరగా మారాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story