ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీకి చేరువలో..

onions

సాధారణంగా రేట్లు పెరిగినప్పుడల్లా ఉల్లిగడ్డ ఆకాశాన్నంటింది అంటాం. కానీ, ఈ సారి ఏకంగా అంతరిక్షాన్నే తాకింది.

రూ. 50.. 100.. 125..150.. కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ఉల్లిగడ్డ రేట్లు ఇవి. అంతేకాదు.. రోహిత్ శర్మ క్రీజ్‌లో కుదురుకుంటే సెంచరీల మోత ఎలా మోగుతుందో.. ఉల్లిగడ్డ రేటు కూడా అంతే స్టాండెడ్ గా దూసుకుపోతోంది. ఉత్తరభారతంలో చాలా చోట్ల ఆనియన్స్ రేట్ 150 రూపాయలు దాటేసింది. కొన్ని చోట్ల 180 కూడా పలుకుతోంది.

హైదరాబాద్‌లో ఉల్లి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరాయి. డబుల్ సెంచరీకి చేరువలో కేజీ ఉల్లి చేరింది. మలక్ పేట్ హోల్ సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి 16 వేల నుంచి 17 వేలు పలికింది. 30 ఏళ్ళ మలక్ పేట్ మార్కెట్ చరిత్రలో రైతుకు 170 రూపాయలు దక్కడం ఇదే మొదటి సారి. దీంతో బహిరంగ మార్కెట్ లో మంచి ఉల్లి కేజీ డబుల్ సెంచరీ అయ్యింది.

పెరిగిన ఉల్లిగడ్డ ధరలు జనంలో అసహనానికి కారణమవుతున్నాయి. ఏ కూర వండాలన్న ఆనియన్స్ కావాల్సిందే. నిత్యవసరాల్లో ఒక్కటిగా మారిన ఉల్లిగడ్డ రేటు పెట్రోల్ రేటు కంటే రెండింతలు కావటంతో ఇల్లు గడిచేదట్టా అని ప్రశ్నిస్తున్నారు గృహిణులు.

కరెంట్ కటెంట్ తో కాస్త కామిక్ గా స్పందించే జనం ఉల్లిరేట్లపై కూడా మీమ్స్ తో సెటైర్లు పేలుస్తున్నారు. బంగారు చైన్ కు బదులు ఉల్లిగడ్డ దండ, రింగ్ లో డైమండ్ కు బదులు ఉల్లిపాయను పొదిగినట్లు..ఇక తాంబులంలో ఉల్లిపాయ ఇచ్చినట్లు ఇలా ఉల్లిగడ్డను బంగారంతో పొలుస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. అంతలా దేశంలో ఉల్లి కొరత ఏర్పడింది. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోవటమే ఇందుకు కారణం.

రాష్ట్రంలో 95 శాతం ఉల్లి పంట ఒక్క కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. తక్కిన 5 శాతం మాత్రమే ఇతర జిల్లాల్లో పండుతోంది. ఏటా 5.25 లక్షల టన్నుల ఉల్లి కర్నూలు జిల్లా నుంచి ఉత్పత్తి అవుతోంది. కానీ, వర్షాలతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉల్లిగడ్డ ఎక్కువగా సాగయ్యే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ లో కూడా వర్షాలు ఉల్లిపంటను దెబ్బతీశాయి. దీనికితోడు డిమాండ్ పెరగటంతో ఉల్లిగడ్డలను నిల్వలను బ్లాక్ చేయటం కూడా రేట్ల పెరుగుదలకు కారణమైంది.