జగన్ సీఎంలా ప్రవర్తించడం లేదు: పవన్

జగన్ సీఎంలా ప్రవర్తించడం లేదు: పవన్

PAVAN

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జనసేన ఆత్మీయ యాత్ర పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కడప జిల్లాలో పర్యటించిన పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓ రాష్ట్రానికి సీఎంలా ప్రవర్తించడంలేదు కాబట్టే జగన్ రెడ్డి అని పిలుస్తున్నానంటూ విమర్శలు చేశారు.

రైతు ఆనందంగా ఉండటమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో పర్యటించిన పవన్‌.. రైతుల సంక్షేమ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. రైతులు తమ సమస్యలను జనసేనాని ముందు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ పాలనపై పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 152 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం తప్పులు చేసిందన్న జగన్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నారని పవన్‌ ప్రశ్నించారు.

బహింగ సభలో స్థానిక సమస్యలనూ ప్రస్తావించారు పవన్‌ కల్యాణ్‌. చిన్న ఓరంపాడులో పచ్చదనాన్ని ఇచ్చే చెట్లును నరికారని, ఆ చెట్ల కన్నీటి శాపం.. నరికిన వారిని సమూలంగా నాశనం చేస్తుందంటూ శాపనార్దాలు పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా చేస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్‌ గడ్డ కాదని, చదువుల తల్లిగా మారుస్తానని చెప్పారు. రాయలసీమను మార్చేందుకే ఇక్కడికి వచ్చానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

అటు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు.

ఇక రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం కడప, రాజంపేట పార్లమెంటరీ నేతలతో రివ్యూ చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story