స్పెషల్‌ బస్సులు, ట్రైన్స్‌ అన్నీ ఫుల్‌ రష్‌..

స్పెషల్‌ బస్సులు, ట్రైన్స్‌ అన్నీ ఫుల్‌ రష్‌..

sankranti

స్కూళ్లకు, ఆఫీసులకు పండగ సెలవులు వచ్చేశాయ్. దీంతో సంక్రాంతి పండగను సెలబ్రేట్‌ చేసుకునేందుకు పల్లెలకు క్యూ కట్టారు జనం. అయితే.. ఎప్పటిలానే ఈసారి కూడా పండుగ కష్టాలు వదలడం లేదు. రైళ్లన్నీ మూడు నెలలు ముందుగానే బుక్కైపోయాయి. స్పెషల్‌ ట్రైన్స్‌ కూడా ఫుల్‌ రష్‌. తత్కాల్‌పై ఆధారపడిన వారికి తిప్పలు తప్పడం లేదు. టికెట్‌ దొరక్క.. రైల్లో సీటు లభించక చుక్కలు చూస్తున్నారు. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికే సందు దొరకడం లేదు. ఇక.. రైల్లోనైతే కాలిపెట్టే చోటే కనిపించడం లేదు. దీంతో.. ప్రతీ యేడు లానే ఈసారి కూడా రైల్వే స్టేషన్లలో తోపులాటలు, తన్నులాటలు కామన్‌గా మారాయి.

ప్రతి ట్రైన్‌కు ఉండేది రెండు మూడు జనరల్‌ బోగీలే అయినా.. లెక్కకు మించి రైల్వేశాఖ టికెట్లను జారీ చేస్తోంది. దీంతో రైలు బోగీల్లో కాళ్లు పెట్టని పరిస్థితి ఏర్పడుతోంది. సీట్లు దక్కించుకునేందుకు అటు ఇటు ఉరుకులు పరుగులు పెడుతున్నారు ప్రయాణికులు. అటు రద్దీకి తగ్గట్లు పెద్దగా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో జనం కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.

ట్రైన్‌ ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు దూసుకురావడంతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలు జులిపించారు. లైన్‌లో నిల్చొపెట్టే ఒక్కొక్కరిని ఎక్కిస్తున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిపోతోంది. నల్గొండ జిల్లాలోని టోల్‌గేట్లన్నీ రద్దీగా మారాయి. కార్లు.. చీమల మాదిరి బార్లు తీరాయి. టోల్‌గేట్‌ సిబ్బంది, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా.. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్‌-విజయవాడ హైవే మీదున్న పంతంగి, కొర్ల పహాడ్‌ టోల్‌ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో టోల్‌గేట్‌ దగ్గర గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. అర్థరాత్రి వరకూ టోల్‌గేట్‌ ట్రాఫిక్‌ ఇలానే టార్చర్‌ చేయడం ఖాయం. ప్రయాణం నిదానంగా మారినా.. టోల్‌గేట్ల వద్ద ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story