‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌' అంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌ అంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

cm-kcr

సాధించిన విజయాల స్ఫూర్తితో కొత్త సంవత్సరంలోనూ మరింత ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన ఆరేళ్లలోనే అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అలాగే వంద శాతం అక్షరాస్యత సాధించడంపైనా దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. ‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌' అనే నినాదంతో ముందుకెళ్లలన్నారు. ప్రతి విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యుడిగా మార్చేందుకు ప్రయత్నించాలన్నారు. తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఈ సవాల్‌ను స్వీకరించాలని పిలుపునిచ్చారు.

ఉద్యమ సమయంలో అంచనా వేసినట్టే తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్నారు KCR. అంధకారమైన రాష్ర్టాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దడం తెలంగాణ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 11వేల 703 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ వచ్చినప్పటికీ ఏమాత్రం కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయగలిగే శక్తికి చేరుకున్నామన్నారు. మిషన్‌ భగీరథ ఫలాలు కూడా ప్రజలకు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొట్టతొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు. మిగతా రాష్ర్టాలు కూడా దీన్నే అనుసరిస్తున్నాయన్నారు. ఇక సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తున్నారు KCR. పెండింగ్‌ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసుకొని.. పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకోగలిగామని, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తికావచ్చాయని తెలిపారు. రాబోయే జూన్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వందకు వందశాతం అందుతాయని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లోనూ పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు.

అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అక్షరాస్యతలో వెనుకవరుసలో ఉండటం ఓ మచ్చగా మిగిలింది. ఈ దుస్థితిని అధిగమించి తీరాలంటే.. చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చడానికి ప్రయత్నంచేయాల్నారు సీఎం. ఈ సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story