10 వేల ఒంటెలను చంపేయాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం

10 వేల ఒంటెలను చంపేయాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం

camel

5 రోజులు..10 వేల ఒంటెలు.. ఎక్కడికక్కడ చంపేయడమే.. ఎంపిక చేసి మరీ ఏరేయడమే.. స్వయంగా ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. ఆస్ట్రేలియాలో ఈ అనూహ్య నిర్ణయం వెలువడింది. ఆసీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది.

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం దావాగ్ని రగులుతోంది. లక్షల హెక్టార్ల అటవీభూమి తగలబడిపోతోంది. వేలాది వన్యప్రాణులు మృత్యువాతపడ్డాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ దారుణ పరిస్థితులను చూసి యావత్ ప్రపంచం తల్లడిల్లుతోంది. ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో వేలాది ఒంటెలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఆస్ట్రేలియాలో దాదాపు 12 లక్షల ఒంటెలున్నాయి. ఇందులో పది వేల ఒంటెలను చంపనున్నారు. అది కూడా ఐదు రోజుల్లో. అంటే రోజుకు సగటున 2 వేల ఒంటెలను హతమార్చనున్నారు. ఇంతటి భయంకరమైన నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కార్చిచ్చు చెలరేగుతోంది. దాంతో మంటల వేడిని భరించలేక ఒంటెలు ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి మరీ నీటిని తాగేస్తున్నాయి. గేట్లు పడగొట్టి మరీ ఇళ్లల్లోకి దూరి గదులను పాడు చేస్తున్నాయి. పైగా, అక్కడే వ్యర్థాలను విడుస్తూ ఇళ్లను పాడు చేస్తున్నాయి. అంతేగాక, కాన్యిపి తెగ మనుగడకు భంగం కలిగిస్తున్నాయి.

ఆస్ట్రేలియాలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కరువు కరాళనృత్యం చేస్తోంది. నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటి వనరులు తగ్గిపోవడంతో దాహార్తి తీర్చుకోవడానికి ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఒంటెలు అధికంగా నీటిని వినియోగించడం వల్ల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 10 వేల ఒంటెలను చంపేయడానికి ఆసీస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story