లాంఛనం పూర్తయింది.. శ్రీలంకపై మరో సిరీస్‌ గెలిచిన భారత్‌

లాంఛనం పూర్తయింది.. శ్రీలంకపై మరో సిరీస్‌ గెలిచిన భారత్‌

india

పుణేలో భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ-20లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో.. లక్ష్యానికి చాలా దూరంలో లంక జట్టు ఆలౌట్ అయింది. పేసర్లు, స్పిన్నర్లు సమన్వయంతో భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆ తర్వాత టార్గెట్‌ చేధనకు దిగిన లంకకు బుమ్రా వేసిన తొలి ఓవర్‌‌లోనే షాక్ తగిలింది. ఒక్క పరుగుతోనే గుణతిలక పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్‌లో అవిష్క పెర్నాండో ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో ఒషాడా ఫెర్నాండో 2 పరుగుల వద్ద బుమ్రాకు చిక్కాడు. ఇక నవ్‌దీప్ సైనీ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికే కుషల్ పెరీరా 7 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కష్టాల్లోపడ్డ జట్టును ఎంజిలో మ్యాథ్యూస్, ధనుంజయ డి సెల్వ 68 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడడంతో శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

భారత్ ఈ మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారత బౌలింగ్‌లో నవ్‌దీప్ సైనీ 3, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరి 2, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలో అదరగొట్టిన శార్దూల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్‌లో అద్భత ప్రదర్శన చేసిన నవ్‌దీప్ సైనీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

అటు.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో వరల్డ్‌ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా నూతన అధ్యాయాన్ని లిఖించాడు. శ్రీలంకతో మూడో టీ20కి ముందు ఈ ఫీట్‌ సాధించడానికి పరుగు దూరంలో నిలిచిన కోహ్లి దాన్ని చేరుకున్నాడు. కెప్టెన్‌గా 169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు.అంతకుముందు ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.

కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌), ఎంఎస్‌ ధోని(భారత్‌), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా), గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. పాంటింగ్‌ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి15,440 పరుగులు చేయగా, గ్రేమ్‌ స్మిత్‌ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఇక ఫ్లెమింగ్‌ 303 మ్యాచ్‌ల్లో 11, 561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు.

Tags

Read MoreRead Less
Next Story