బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగత్ ప్రకాష్ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగత్ ప్రకాష్ నడ్డా

amitsha

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్‌ షా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. నడ్డా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ దేశంలోకెల్లా బలమైన పార్టీ అని అన్నారు. రానున్న రోజుల్లో కమలాన్ని దేశవ్యాప్తంగా వికసింపజేస్తామన్నారు. పార్టీ మరింత ఎదగాల్సిన అవసరం వుందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. తన లాంటి సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరుకోవడం ఒక్క బీజేపీలోనే సాధ్యమన్నారు.

మరోవైపు నడ్డాకి పార్టీ సీనియర్ నేతలు శుభాకాంక్షు తెలిపారు. జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్టీలో నడ్డా అత్యున్నత కార్యకర్త అని కొనియాడారు. పార్టీ పటిష్టత కోసం ఓ నిబద్ధత గల కార్యకర్తలా నడ్డా అలుపెరుగని సేవలదించారని అన్నారు. నడ్డా తనకు పాత స్నేహితుడని.. ఇద్దరం కలిసి ఒకే స్కూటర్ పై తిరిగామని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ లో నడ్డాతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇన్నాళ్లూ పార్టీకి సేవలందించిన అమిత్‌ షాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అమిత్‌ షా చేసిన కృషికి పొగడటానికి మాటలు చాలవన్నారు. ఆయన కృషి వల్లే ఎన్నో రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అమిషా లా నడ్డా కూడా పార్టీకి వన్నె తెస్తారని మోదీ ఆకాక్షించారు.

నడ్డా సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగడం ఆనందకరమన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. ఇది ఒక్క బీజేపీలోనే సాధ్యమని అన్నారు. ఓ సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేసినందుకు అమిత్‌ షా కు కృతజ్ఞతలు తెలిపారు. నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అటు.. జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీ కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు దూసుకుపోతుందన్నారు రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్. ఓ నిబద్ధత గల కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం గర్వకారణమని అన్నారు. వాజ్ పేయి, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఠాక్రే వంటి దిగ్గజాల మాదిరిగా.. నడ్డా కూడా పార్టీని మరింత ఉన్నతస్థాయిలో నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నడ్డా ఎన్నిక పార్టీకి లాభిస్తుందని మాజీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కార్యకర్తలందరి తరఫున నడ్డాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీతో కలిసి నడ్డా పార్టీకి మరింత వన్నె తెస్తారని ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story