ఈ ప్రశ్నలకు బదులిస్తారా?

ఈ ప్రశ్నలకు బదులిస్తారా?

అమరావతి ప్రశ్నిస్తోంది. గొంతెత్తి నినదిస్తోంది. ఉన్న ఫళంగా బీద ఏడుపు ఏడుస్తున్న ప్రభుత్వాన్ని నిగ్గదీసి కడిగిపారేస్తోంది రాజధాని ప్రాంతం. మిస్టర్ సీఎం మీ పొదుపు మంత్రం వెనక...మీ బీద ఏడుపుల వెనక ఏ స్వార్ధం దాగుందో కాస్త చెబుతారా ? అని అడుగుతోంది. ఎందుకు అంటారా? అయితే..జగన్ ఏమన్నారో మీరే వినండి.

అవును. ఆలోచిస్తుంటే మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న అసెంబ్లీ కౌన్సిల్ మనకు మాత్రం అవసరమా? అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి 60 కోట్లు ఖర్చు అవుతోందని అంటున్నారు. అంతేకాదు.. మండలి ఒక్కసారి సమావేశం అయితే..కోటి రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కగట్టి మరీ రాష్ట్ర పేదరికాన్ని, 60 కోట్ల రూపాయల ఆర్ధిక భారాన్ని కూడా మోయలేని బీదరికాన్ని సభలో చాటిచెప్పారు మీరు. కానీ, మిస్టర్ సీఎం..అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే..వాళ్లు మీలా 60 కోట్లు..వంద కోట్ల ఖర్చులపై కాదు మీ ప్రభుత్వంలో జరుగుతున్న వేల కోట్ల దుబారాని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర పేదరికాన్ని బేరీజు వేసుకుంటూ ఖర్చు పెట్టే మీ ప్రభుత్వ హాయంలో.. రాజధాని తరలింపు కారణంగా జరుగుతున్న వేల కోట్ల నష్టం ఎందుకు మీకు కనిపించటం లేదు? 33 వేల ఎకరాలు, వందల రైతు కుటుంబాల త్యాగాలు మీ బోటి వాళ్లకు పెద్ద లెక్కలోకి రాకపోవచ్చు. కానీ, అమరావతి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ భవనాలకు దాదాపు 5 వేల కోట్లకు పైగా ఖర్చు జరిగింది. అయితే..రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్న మీ పంతంతో ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతుంది. కేవలం 60 కోట్లకు గీకిగీకి లెక్కలు వేసుకునే ఈ పేదరాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా? జస్ట్ ఆస్కింగ్ అని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఈ పొదుపు మంత్రం జపించే మన రాష్ట్రంలో ఎమ్మెల్సీలకు లక్షల జీతాలు ఇస్తున్నామని కూడా భావన అయిఉండొచ్చు. కానీ, మిస్టర్ సీఎం మీరు అన్నట్లు లెక్కగట్టినా మీ చుట్టు చేర్చుకున్న సలహాదారులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. మరి ఈ పేద రాష్ట్రానికి అంతమంది సలహాదారులు అవసరమా? జస్ట్ ఆస్కింగ్ అని అమరావతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

58 మంది సభ్యులు ఉండే మండలి ఖర్చు ఖజానాకి భారం అంటున్నారు. కానీ, మిస్టర్ సీఎం..వాలంటీర్ల రూపంలో మీ కార్యకర్తలకు ఉపాధి చూపించిన వాలంటీర్ల నియామకంలో రాష్ట్ర ఖజానాకు ఎలా లాభం చేకూరుస్తుందో చెప్పగలరా? అసలు ఈ పేద రాష్ట్రంలోని వాలంటీర్లలో 95% మంది మీ కార్యకర్తలను భర్తీ చేయటం కరెక్టేనా? అని అడుగుతున్నారు. ఇక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఓ డిప్యూటీ సీఎంకు ఉన్న వాస్తవ ప్రధాన్యత మీకు తెలియంది కాదు. ఒకరిద్దరు ఉంటేనే గొప్ప విషయం. అలాంటిది ఈ పేద రాష్ట్రం నెత్తిన 5 ఉప ముఖ్యమంత్రులను కూర్చొబెట్టడం అవసరమా? ఇక రాజధాని తరలింపులో మీ పంతం నెగ్గించుకునేందుకు మీరు అనురిస్తున్న విధానాలు కరెక్టెనంటారా? ప్రజావ్యతిరేక నిర్ణయాలను గెలిపించుకునేందుకు 5 కోట్లు పోసి లాయర్ ను అపాయింట్ చేయటం ఈ పేద రాష్ట్రానికి అవసరం అంటారా? అని జనం ప్రశ్నిస్తున్నారు.

పెద్దల సభ కంటే ప్రజా ధనానికి మీ ప్రభుత్వం ఎక్కువ విలువ ఇస్తుంది అనుకుందాం. కానీ, ముఖ్యమంత్రిగారు, ప్రజాధనంతో కట్టిన ప్రజా వేదికను ఎలా కూల్చారు? ఈ పేద రాష్ట్రంలో జనం సొమ్ముతో కట్టిన ప్రజావేదికను కూల్చటం కరెక్టేనా? అన్నది ప్రజల ప్రశ్న. ప్రజా ధనాన్ని పొదుపు చేయటంలో, ఆర్ధిక క్రమశిక్షణ పాటించటంలో మీ ప్రభుత్వం పాటించే నిబద్ధత శంకించలేనిదే అనుకుందాం. కానీ, ఈ పేద రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు, పంచాయితీ ఆఫీసు బిల్డింగులకు వైసీపీ రంగులు వేయించినప్పుడు పొదుపు మరిచిపోయారా? ఈ రాష్ట్రాని ఆ రంగులే అభివృద్ధి సంకేతాలు అని భావించారా? మండలికి రోజుకు కోటి అవుతుందిని మీరు కళ్లు తెరిపించే సత్యం జనాలకు చెప్పారు. కానీ, మిస్టర్ సీఎం..ప్రతీ శుక్రవారం మీ ప్రయాణానికి అయ్యే ఖర్చు 60 లక్షలు. ఈ పేద రాష్ట్రానికి అంత ఖర్చు అవసరమా? ఈ పేద రాష్ట్రంలో మీరు అసెంబ్లీ వెళ్లటానికి స్పెషల్ రోడ్డు అవసరమా? అని రాష్ట్ర ప్రజానీకం అడుగుతోంది?

Tags

Read MoreRead Less
Next Story