'అశ్వథ్థామ' రివ్యూ.. మూవీ సూపర్ హిట్

అశ్వథ్థామ రివ్యూ.. మూవీ సూపర్ హిట్

అశ్వథ్థామ.. నాగశౌర్య హీరోగా నటించిన సినిమా. అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో రూపొందిన ఈ చిత్రానికి కథ కూడా శౌర్యదే కావడం విశేషం. విడుదలకు ముందే భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం శుక్రవారం జనవరి 31న విడుదలైంది. మెహ్రీన్ కౌర్ హీరో్యిన్ గా నటించిన ఈ మూవీకి రమణతేజ దర్శకుడు. అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీ కథేంటీ.. కథనం ఎలా ఉంది. అనేది ఈ మినీ రివ్యూలో చూద్దాం.

ఘనా అనే కుర్రాడిది అమ్మానాన్న ఓ చెల్లితో కలిసి ఉండే చిన్న జీవితం. అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండే .. ఘనా తన చెల్లి పెళ్లి కోసం ఇండియాకు వస్తాడు. ఆ పెళ్లిని అట్టహాసంగా చేయాలనుకుంటోన్న సమయంలో తన చెల్లికి సంబంధించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది అతనికి. ఆ విషయాన్ని దాచి పెళ్లికొడుకు పెద్ద మనసుతో పెళ్లి చేస్తాడు. కానీ ఆ షాకింగ్ ఇన్సిడెంట్ వెనక ఉన్నది ఎవరా అని చేసే ఇన్వెస్టిగేషన్ లో అలాంటివే మరికొన్ని విషయాలు తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. సొసైటీలో అమ్మాయిలకు తెలియకుండానే జరిగే ఇలాంటి అఘాయిత్యాల వెనక ఉన్న ఆ వ్యక్తిని ఘనా ఎలా ట్రేస్ చేశాడు అనేది తర్వాత సాగే వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ.

అశ్వథ్థామ.. ఈ సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ అయినా ముందుగా వెళ్లేది నాగశౌర్యకే. ఇలాంటి కథ ఇప్పటి వరకూ మనం చూడలేదు. అసలు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయా అనే ఓ ఆశ్చర్యకరమైన ఫీలింగ్ కూ లోనవుతాం.. ఇప్పటి వరకూ ఆడవాళ్ల మీద జరిగిన ఎన్నో అఘాయిత్యాలకు భిన్నంగా ఉన్న ఈ తరహా నేరాలు ఇప్పటి వరకూ సరిగా వెలుగులోకి రాలేదు. కానీ తన ఫ్రెండ్ వాళ్ల చెల్లికి జరిగిన ఆ దారుణం నుంచి ఈ కథ రాసుకున్నా అన్నాడు శౌర్య. అయితే దీన్ని ఆషామాషీగా కాక పక్కాగా రాసుకున్నారు. కథే కాదు.. కథనం సైతం పరుగులెడుతూ.. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది.

సినిమా ఆరంభం కాగానే నేరుగా కథలోకే వెళతారు. ఓ చిన్న పాటతో హీరో ప్రేమకథను కూడా సాగదీయకుండా చూసుకున్నారు. ఇక తన చెల్లి పెళ్లి జరిగిన తర్వాత హీరో ఆ నేరస్తుడి కోసం సాగించే అన్వేషణకు సంబంధించిన ప్రతి సన్నివేశం ఉత్కంఠకు గురి చేస్తుంది. ఒక దశలో థ్రిల్లర్ లా అనిపిస్తూ.. ప్రతి సీన్ తో విలన్ హీరోకు చాలెంజ్ లు విసురుతుంటే.. దాని వెనక ప్రతి ప్రేక్షకుడూ పరుగులు పెడతాడు. చెల్లికోసమే కాకుండా సొసైటీ కోసం కూడా హీరో సాగించిన పోరాటం.. చివరికి ఓ గొప్ప సర్ ప్రైజ్ తో ముగుస్తుంది. థియేటర్ లోని ప్రేక్షకులంతా ఖచ్చితంగా థ్రిల్ ఫీలయ్యే సినిమా ఇది.

ఘనా పాత్రలో నాగశౌర్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ కు స్పేస్ తక్కువే అయినా మెహ్రీన్ ఆకట్టుకుంటుంది. ప్రిన్స్ తో పాటు శౌర్య సిస్టర్ పాత్రలో నటించిన అమ్మాయీ బాగా చేశారు. అలాగే విలన్, అతని తాత, తండ్రి పాత్రల్లోనూ మంచి క్లారిటీ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బావుంది. జిబ్రన్ నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచిందీ చిత్రానికి. మొత్తంగా నాగశౌర్య ముందు నుంచీ ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో సినిమా చూస్తే తెలుస్తుంది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా అశ్వథ్థామను చెప్పొచ్చు.

-బాబురావు

Tags

Read MoreRead Less
Next Story