జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో శాసన మండలికి మంగళం పాడనున్నారా?

జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో శాసన మండలికి మంగళం పాడనున్నారా?

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మండలిలో విజయవంతంగా అడ్డుకుంది టీడీపీ. ఆ రెండు బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం భగ్గుమంది. బిల్లులను తిప్పిపంపాలి లేదా సవరణలు చేయాలి. కానీ లేని అధికారంతో సెలక్ట్ కమిటీకి ఎలా పంపుతారంటూ ప్రశ్నించింది. అసెంబ్లీలో మండలిలో జరిగిన పరిణామాలపై వాడివేడి చర్చజరిగింది. టీడీపీ, మండలి ఛైర్మన్ షరీఫ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు. ఆ తర్వాత మంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్.. మండలిని రద్దు చేయాలంటూ సీఎం జగన్‌కు ప్రతిపాదించారు.

ఆ తర్వాత మాట్లాడిన సీఎం జగన్.. మొదట మండలిలో ఛైర్మన్ షరీఫ్ చేసిన ప్రసంగం మొత్తాన్ని అసెంబ్లీలో ప్రదర్శించారు. విడిపోయిన, ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా? అని ప్రశ్నించారు. మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారని.. కానీ డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు అసెంబ్లీలో ఉన్నారని, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారని ప్రశ్నించారు. ఇంత మంది విజ్ఞులు అసెంబ్లీలోనే ఉంటే, మండలి అవసరమేముందని అన్నారు.

హత్య చేయడం తప్పు. అయినా హత్య చేస్తా అన్నట్టుగా మండలి తీరు ఉందన్నారు సీఎం జగన్. ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని ప్రశ్నించారు. దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని అన్నారు. అసలు రాజ్యాంగంలో కేపిటల్‌ అనే పదమే లేదని.. తమిళనాడు ప్రభుత్వం ఊటీ నుంచి, అలాగే హుద్‌ హుద్ వచ్చినప్పుడు విశాఖ నుంచి ప్రభుత్వం నడిచిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడ నుంచే ప్రభుత్వం నడుస్తుందని అన్నారు.

మండలి కోసం ఏడాదికి రూ.60కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్. ఎలాంటి సంకేతాలు ఇచ్చేందుకు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చున్నారో అందరికీ తెలుసన్నారు. మండలి అనేది సలహాలు, సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలని, కానీ బిల్లులు.. చట్టం కాకుండా నిరోధించే సభగా మారిందని విమర్శించారు.

మండలి చైర్మన్‌ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్నారు టీడీపీ నేత యనమల. సీఎం జగన్‌కు రూల్స్‌ తెలియవని, ఆయనికి ఎవరూ చెప్పరని ఎద్దేవా చేశారు. మండలిలో మేధావులు, డాక్టర్లు, ఉన్నారని సీఎం జగన్‌ చెబుతున్నారని, బహుశా క్రిమినల్‌ యాక్టర్స్‌ కూడా ఉండి ఉంటారని విమర్శించారు.

మండలి రద్దుపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరగనుంది. సీఎం వ్యాఖ్యలను బట్టి చూస్తే మండలిని రద్దు చేసే దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారమే ఈ దిశగా తీర్మానం చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Read MoreRead Less
Next Story