మూగబోయిన మైకులు.. ఖాళీ అయిన రోడ్లు

మూగబోయిన మైకులు.. ఖాళీ అయిన రోడ్లు

STOP

తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో గత వారం, పది రోజులుగా పట్టణాలు, నగరాల్లో మోగిన మైకులు మూగబోయాయి. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలో ఈనెల 22న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 24న ఎన్నికలు జరగనున్న కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో మాత్రం బుధవారం వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. ఇప్పటికే సర్వశక్తులొడ్డిన నేతలు.. తర్వాత అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ఇక మలిదశ వ్యూహాలను అమలు చేయనున్నారు.

మొత్తం మీద ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ అంతటా దద్దరిల్లింది. ఇక పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు పలు రూపాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం కానున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కాళ్లకు బలపాలు కట్టుకొని పట్టణాల్లో తిరిగారు. రోడ్‌ షోలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని వార్డులు, డివిజన్లలో అభ్యర్థులను వెంటపెట్టుకొని ప్రజలను ఓట్లడిగారు. టీఆర్‌ఎస్‌ ఈ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బీజేపీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పర్యటించగా ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు ఇతర కీలక నేతలు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు.

ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వామపక్షాలు, టీజేఎస్‌ తదితర పార్టీల నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అన్ని పార్టీల నేతలు మున్సిపాలిటీల వారీగా స్థానిక సమస్యలను ఫోకస్‌ చేసుకుంటూ తమను ఎందుకు గెలిపించాలో కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు సోషల్‌ మీడియా ద్వారా కూడా అన్ని పార్టీల అభ్యర్థులు, శ్రేణులు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నాయి.

రాజకీయ పార్టీల అధికారిక అభ్యర్థులకు దీటుగా ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడి రెబల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రులుగా బరిలో ఉన్న దాదాపు 3 వేల మందికిపైగా అభ్యర్థులు సైతం సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా రెబల్స్‌ బరిలో ఉండటంతో వారి ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 25న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story