ఆడవాళ్లపై ఆగని దారుణాలు.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ఆడవాళ్లపై ఆగని దారుణాలు.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

murder

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రాంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా చంపేశాడు. హన్మకొండ రాంనగర్‌కు చెందిన షాహిద్ స్థానికంగా ఉన్న ఓ మటన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. లష్కర్ సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని హారతితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాంనగర్ లోని షాహిద్ అద్దెగదికి యువతి వెళ్లింది. అక్కడ వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో నిందితుడు హారతిపై కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఆమె గొంతు కోసి అక్కడనుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే చనిపోయింది.

హారతిని హత్య చేసిన షాహిద్‌.. విష్ణుపురిలోని తన ఇంటికి వెళ్లి స్నానం చేసి.. వేరే దుస్తులు మార్చుకుని మరీ సుబేదారి పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. తాను హత్య చేసిన విషయాన్ని చెప్పడంతో పాటు కత్తి, గది తాళాలు అప్పగించాడు. దీంతో పోలీసులు షాహిద్‌ను తీసుకుని హత్య జరిగిన గది వద్దకు వెళ్లారు. గది తాళం తీసి చూసే సరికి రక్తపు మడుగులో హారతి శవంగా పడిఉంది.

రాంనగర్ లోని ఘటనాస్థలిని వరంగల్ సీపీ రవీందర్ పరిశీలించారు. అదుపులోకి తీసుకున్న షాహిద్ నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ఎవరో ఫోన్‌ చేస్తే.. బయటకు వెళ్తున్నానని చెప్పి కానరానిలోకాలకు వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. హారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

హత్యకు గురైన హారతికి సంక్రాంతి పండుగ తర్వాత వివాహం జరగాల్సి ఉంది. వరంగల్‌కే చెందిన ఓ యువకుడితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. ఇంతలోనే హత్యకు గురి కావడంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. కాగా, వేరే యువకుడితో సన్నిహితంగా ఉండటం.. వేరే యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో కోపాన్ని పెంచుకున్న షాహిద్‌.. తాను ప్రేమించిన యువతి తనకు దక్కకుండా పోతుందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story