నల్గొండ మున్సిపాలిటీపై గులాబీ జెండా

నల్గొండ మున్సిపాలిటీపై గులాబీ జెండా

మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ హవా కొనసాగుతూనేవుంది. సోమవారం ఈసీ ఆదేశాలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో.. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఆ పార్టీ కౌన్సిలర్ అబ్బగోని రమేష్ నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మొత్తం 48 వార్డులున్న నల్గొండ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కూటమికి 22, కాంగ్రెస్ 20, బీజేపీ 6 మంది సభ్యుల బలం వుంది. అయితే, వైస్ చైర్మన్ ఎంపిక కోసం సరిపడా మెజారిటీ లేకపోవడంతో టీఆర్ఎస్ తరఫున.. గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరా చిన్నపరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో వైస్ చైర్మన్ పదవి కూడా టీఆర్ఎస్ పార్టీకే దక్కింది.

చైర్మన్ ఎన్నిక సమయంలో బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందనే ప్రచారం వున్నప్పటికీ.. వైస్ చైర్మన్ పదవిని కూడా గులాబీ పార్టీయే సొంతం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, తాము బీజేపీకి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. సెక్యులర్ పార్టీగా ఓ రాజకీయ విధానంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఇదిలావుంటే, బీజేపీ వాదన మరోలా వుంది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ తమను మోసం చేసిందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. చైర్మన్ ఎన్నిక సమయంలో తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారని అన్నారు. తీరా, ఇప్పుడు ఆ పదవిని కూడా టీఆర్ఎస్ అభ్యర్థికే కట్టబెట్టారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి తమకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story