వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

టైటిల్‌ : వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌

జానర్ ‌: లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ డ్రామా

నటీనటులు : విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్‌, ప్రియదర్శి

దర్శకత్వం: క్రాంతి మాధవ్‌

సంగీతం: గోపీ సుందర్‌

నిర్మాతలు: కేఏ వల్లభ, కేఎస్‌ రామారావు

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. గీత గోవిందంతో వంద కోట్ల క్లబ్ లో చేరి సత్తా చాటాడు. తర్వాత అతనికి కొన్ని ఊహించని పరాజయాలు వచ్చినా.. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వచ్చాడు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో, కెఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ముందు నుంచీ మంచి అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయింది టీమ్. మొత్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉన్నాడో చూద్దాం..

గౌతమ్, యామినీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు. గౌతమ్ తను చేస్తోన్న ఉద్యోగం మానేసి.. రచయిత కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అప్పటి వరకూ ఇంటిని యామినీ చూసుకునేలా ఒప్పిస్తాడు. కానీ యేడాదిన్నర అయినా గౌతమ్ పుస్తకం రాయకపోగా.. పూర్తి బద్ధకంగా తయారై.. తను ప్రేమించిన యామిని కోసం కనీసం అరగంట టైమ్ కూడా కేటాయించడు. దీంతో విసిగిపోయిన యామినీ అతనికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ బాధ తట్టుకోలేక గౌతమ్.. తనకోసం పలవరిస్తూ.. పేపర్ లో వచ్చిన ఓ వార్త చూసి ఇన్స్ స్పైర్ ఓ కథ రాస్తాడు. ఆ కథలో కథానాయకుడుగా తననే ఊహించుకుంటాడు. అటుపై యామిని వల్లనే మరో కథ కూడా రాసుకుంటాడు. కానీ యామినీ తిరిగి రాకపోగా.. మరో పెళ్లికి సిధ్ధమవుతుంది. ఈ క్రమంలో అతను అనుకోకుండా జైలుకు వెళ్తాడు. మరి అతను జైలుకు ఎందుకు వెళ్లాడు. ఈ కథల వల్ల అతనికి ఎలాంటి గుర్తింపు వచ్చింది.. యామినీ మరో పెళ్లి చేసుకుందా లేక తిరిగి వచ్చిందా అనేది మిగతా కథ.

కొన్ని కథలు చెప్పినంత సులువు కాదు.. కథనంగా మారడం. పైగా ఒకే కథలో నాలుగైదు స్టోరీలు మిక్స్ అయి ఉన్నాయంటే కథనం ఇంకా సంక్లిష్టం అవుతుంది. ఆ సంక్లిష్టతను ప్రేక్షకుడు ఫీలవకుండా సరళమైన కథనం రాసుకుంటేనే ఆకట్టుకుంటారు. ఈ విషయంలో దర్శకుడు క్రాంతి మాధవ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు అని చెప్పలేం కానీ.. మాగ్జిమం మెప్పించాడు. ఒక్కో కథతో ఒక్కో తరహా కథనంతో అలరించాడు. ముఖ్యంగా ఇల్లందు బ్యాక్ డ్రాప్ లోసాగే శీనయ్య, సువర్ణల ఎపిసోడ్ ఓ ఎపిక్ అని చెప్పాలి. ఈ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకూ ఒక్క తెలుగు సినిమా రాకపోవడం ఓ కారణమైతే.. ఆ పాత్రల్లో విజయ్, ఐశ్వర్య రాజేశ్ పోటీపడి మరీ నటించడం మరో కారణం. ఈ కథ వరకూ ఓ అద్భుతం అని చెప్పాలి.

ఈ సినిమాలో గౌతమ్ రాసిన కథల్లో నుంచి కనిపించేవి రెండు ప్రేమకథలే. మరొకటి అతని అసలు కథ. ఆ కథ నుంచి పుట్టుకు వచ్చిన ఈ రెండు కథల్లోనూ తననే ఊహించుకుంటాడు. అలా ఊహించుకోవడానికి దర్శకుడు సరైన సన్నివేశాలు సృష్టించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. తనను వదిలి వెళ్లిన యామినీకి ప్రేమ విలువల తెలియదు. తన త్యాగం తెలియదు అనుకుంటాడు. అలాగే.. తన త్యాగం వల్లే యామినికి ఉద్యోగం వచ్చిందనే కోపంతో ఆ త్యాగం చేయకుంటే తను ప్యారిస్ లో ఉండేవాడిని అంటూ ఆ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ రాస్తాడు. అంటే తను ప్యారిస్ వెళ్లి ఉంటే అనే ఆలోచన నుంచి అన్నమాట. ఆ కథలోనూ తనే త్యాగం చేసినట్టుగా రాసుకుంటాడు. ఈ రెండు త్యాగాల మధ్య తన గతాన్ని తలచుకుని రియలైజ్ అవడం అనే పాయింట్ తో క్లైమాక్స్ రాసుకున్నాడు దర్శకుడు. కొంత కాంప్లెక్స్ గా అనిపించినా.. క్లైమాక్స్ కు ముందు విజయ్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలే ఈ కథకు అసలు మూలం.

ప్రేయసి కోసం తనే త్యాగం చేశాను అనుకున్న హీరో.. తన కథల నుంచే రియలైజ్ అవుతాడు. ఆ కథలను తరచి చూస్తే ఆ త్యాగం నిజానికి యామిని చేసిందనే నిజం బోధపడుతుంది. అప్పటికే తను వెళ్లిపోయి ఉండటంతో బాధపడటం తప్ప వేరేం చేయలననే నిస్పృహకు లోనవుతాడు. ఆ టైమ్ లో ఇక గౌతమ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నకు మంచి సమాధానంతో క్లైమాక్స్ ను ముగిస్తాడు దర్శకుడు.

మొత్తంగా కొంత సంక్లిష్టమైన కథనమే అయినా.. ప్రతి మనిషి తన తప్పులను తెలుసుకునేందుకు ఈ కథలో గౌతమ్ కథలు రాసిన తర్వాత తెలుసుకున్నట్టుగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టైమ్ వస్తుంది. ఆ టైమ్ వచ్చేంత వరకూ చూడకుండా కాస్త రాజీపడితే బంధాలు నిలబడతాయి అనే పాయింట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కు ప్రధాన బలం క్రాంతి మాధవ్ కథ, కథనమే. సినిమాటోగ్రపీ బావుంది. పాటలు సిట్యుయేషనల్ సాగడంతో మరీ అంత గొప్పగా అనిపించవు.

విజయ్ దేవరకొండ మరో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ముఖ్యంగా ఇల్లందు ఎపిసోడ్ లో ఆరేళ్ల పిల్లాడికి తండ్రిగానూ నటించి ఆశ్చర్యపరిచాడు. తర్వాత ఐశ్వర్య రాజేశ్ కే ఎక్కువ మార్కులు. ఇక రాశిఖన్నా ప్రధాన హీరోయిన్ పాత్రలో మరో బెస్ట్ నటన చూపించింది. ప్యారిస్ కథలో ఇజబెల్లా, ఇల్లందు ఎపిసోడ్ లో కేథరీన్ కూడా బాగా చేశారు. మొత్తంగా ఈ వరల్డ్ ఫేమస్ లవర్ కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. మరి కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్‌దేవరకొండ

ఐశ్వర్య రాజేశ్

ఫస్ట్ హాఫ్

ఇల్లందు ఎపిసోడ్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

కథనం

పాటలు

స్లోనెరేషన్

ఎంటర్‌టైన్మెంట్

చివరిగా.. ఒక కథలో ఫేమస్ లవర్

-కే.బాబురావు

Tags

Read MoreRead Less
Next Story