'భీష్మ' రివ్యూ

భీష్మ రివ్యూ

టైటిల్ : భీష్మ

నటులు : నితిన్, రష్మిక, అనంత్ నాగ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సంపత్

కెమెరా : సాయి శ్రీరామ్

సంగీతం : మహతి స్వరసాగర్

నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం : వెంకీ కుడుముల

కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్నాడు నితిన్. ఇటు వరుసగా హిట్స్ అందుకుంటోంది హీరోయిన్ రష్మిక. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అన్నప్పుడే చాలామంది పాజిటివ్ సైన్ గా ఫీలయ్యారు. అంటే ఖచ్చితంగా నితిన్ కు హిట్ ఇస్తుందీ బ్యూటీ అనే భావంతో. ఇక మొదటి సినిమా ఛలోతో సూపర్ హిట్ అందుకుని ద్వితీయ విఘ్నాన్ని దాటడానికి దర్శకుడు వెంకీ కుడుముల చేసిన ఈ భీష్మ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో చూద్దాం..

కథ :

చదువు అబ్బక డిగ్రీ ఫెయిల్ అయిన కుర్రాడు భీష్మ(నితిన్). తన పేరే శతృవుగా సరిగా చదువురాని వ్యక్తిగా ఉన్నా.. సోషల్ మీడియాలో ట్రెండీగా ఉన్న మీమ్స్ చేస్తుంటాడు. ఓ రోజు తాగి పోలీస్ లకు దొరుకుతాడు. అతన్ని విడిపించేందుకు తన రిలేటివ్ సాయం తీసుకుంటాడు. కానీ ఆ హెల్ప్ చేసిన సిటీ కమీషనర్.. భీష్మకు డిసిప్లిన్ నేర్పుతానంటూ తన వద్దే పనిచేయించుకుంటాడు. ఆ పనిలో వెళుతున్నప్పుడే అతనికి చైత్ర(రష్మిక మందన్నా)పరిచయం అవుతుంది. చైత్ర భీష్మ అనే ఆర్గానిక్ ఫుడ్ కంపెనీలో కీలక ఉద్యోగిగా పనిచేస్తూంటుంది. భీష్మ తనతో ప్రేమలో పడతాడు. తననూ ఇంప్రెస్ చేస్తాడు. భీష్మపై మంచి అభిప్రాయం కలగడంతో తనే ఐ లవ్యూ చెబుతుంది చైత్ర. కానీ ఏసిపీ కూతురే చైత్ర. మరి ఈ ప్రేమకథకు ఏసిపి ఒప్పుకున్నాడా..? భీష్మ ఆర్గానిక్ కంపెనీకి ఈ భీష్మకు ఉన్న సంబంధం ఏంటీ..? అసలు భీష్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనేది మిగతా కథ.

విశ్లేషణ :

భీష్మ.. ఓ సాధారణమైన కథను కాస్త మెసేజ్ ను జోడించి ఎంటర్టైనింగ్ గా చెప్పాడు దర్శకుడు వెంకీ కుడుముల. తనకు బాగా తెలిసిన కామెడీని లైటర్ కోట్ లో వాడుతూ ఆర్గానిక్ ఫామ్ వల్ల ఉపయోగాలు, రసాయనిక వ్యవసాయంతో వచ్చే నష్టాలను సినిమాటిక్ గా చెప్పినా బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సేంద్రియ వ్యవసాయం గురించి ఉపన్యాసాలు లేకుండా.. సింపుల్ గా లైటర్ వేలో చెబుతూ.. ఆ మధ్యలో ఈ భీష్మ, చైత్రల ప్రేమకథను అందంగా చెబుతూ.. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, రఘుబాబులతో సిట్యుయేషనల్ కామెడీని పండిస్తూ రెండున్నర గంటల పాటు ఎంటర్టైనర్ చేయడంలో వెంకీ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

వ్యవసాయం పై సినిమా అంటే చాలా ఊహించుకుంటాం. వాటికి భిన్నంగా కొత్త పద్ధతిలో ట్రెండీ మెథడ్స్ ను జోడిస్తూ చెప్పడంతో ఈ ఆర్గానిక్ ఫామ్ పై ఆడియన్స్ లోనూ ఓ రకమైన అభిప్రాయం కలిగించడంలోనూ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ కథను నిరుద్యోగి, పెద్దగా చదువుకోని వ్యక్తితో మొదలుపెట్టి.. ఉన్నతమైన స్థితిలో ఉన్నా.. విమెన్ ఎంపవర్ మెంట్ అంటూ.. తనదైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ముడిపెట్టినప్పుడే దర్శకుడు ఆడియన్స్ లో ఓ థాట్ వచ్చేలా చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నో తెలుగు సినిమాలపై తిరుగులేని సెటైర్ వేసిన అతను ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను దించేస్తూ.. భీష్మ కంపెనీకి, భీష్మకు ఉన్న సంబంధాన్ని ముడిపెట్టిన వైనం ఆకట్టుకుంటుంది.

నేలను పాడు చేయొద్దు.. మనం మట్టికి విషం ఇస్తే అదీ విషమే ఇస్తుంది. సేంద్రియ వ్యవసాయం గురించి మన పురాణాల్లోనూ అద్భుతంగా చెప్పారు. అలాంటి పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే రాబోయే తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి అదే అంటూ చెప్పిన ఈ కథ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గానే సాగింది.

ఇక ప్రధాన జోడీగా నటించిన నితిన్, రష్మిక లపై సినిమా అంతా ఆధారపడి ఉంది. ఆ ఇద్దరూ అదరగొట్టారు. నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తే.. రష్మిక క్యూట్ గా ఉంటేనే సిట్యుయేషన్స్ ను బట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇతర పాత్రల్లో అనంత్ నాగ్ తన పాత్రకు హుందాతనాన్ని తెచ్చారు. వెన్నెల కిశోర్ మరోసారి కామెడీ బాధ్యత తీసుకుని సక్సెస్ అయ్యాడు. బ్రహ్మాజీ, సంపత్, నరేష్ ల పాత్రలు రొటీన్. రఘుబాబు నవ్వించాడు.

అయితే విడుదలకు ముందు ఊదరగొట్టినంతగా ఆ చివరి పాటలో అంత ఎనర్జిటిక్ స్టెప్సేం లేవు. అలాగే పాటలు బావున్నా.. నేపథ్య సంగీతం ఆకట్టుకోదు. పైగా కాపీ ట్యూన్స్ వినిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. మాటలతో మరోసారి మెప్పించాడు దర్శకుడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. ఆర్ట్ వర్క్స, సెట్స్ అన్నీ యాప్ట్ గా కుదిరాయి. మొత్తంగా ఈ సినిమాతో దర్శకుడు వెంకీ కుడుముల ద్వితీయ విఘ్నాన్ని దాటేశాడనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

నితిన్, రష్మిక

కథనం

ఎంటర్టైన్మెంట్

ఆర్గానింగ్ ఫామింగ్ ఎపిసోడ్స్

పాటలు

మైనస్ పాయింట్స్ :

కొత్త కథ కాదు

నేపథ్య సంగీతం

ఫస్ట్ హాఫ్ సాధారణంగా ఉంటుంది.

ఫైనల్ గా : ఆర్గానిక్ ఎంటర్టైనర్

-బాబురావు. కె

Tags

Read MoreRead Less
Next Story