ఎమ్మెల్సీ పదవులపై టీఆర్ఎస్‌లో ప్రారంభంకానున్న పొలిటికల్ ఈక్వేషన్స్

ఎమ్మెల్సీ పదవులపై టీఆర్ఎస్‌లో ప్రారంభంకానున్న పొలిటికల్ ఈక్వేషన్స్

మున్సిపల్ ఎన్నికలు, సహకార ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీపై పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోగా గవర్నర్‌ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పదవీకాలం ముగియబోయే ఎమ్మెల్సీల జాబితాలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సబావత్‌ రాములునాయక్‌, కర్నె ప్రభాకర్‌ పేర్లున్నాయి. నాయిని 2020 జూన్‌ 19న పదవీ కాలం ముగియనుంది. కర్నె ప్రభాకర్‌ పదవీకాలం ఆగస్టు 17తో ముగుస్తుంది. ఇక అనర్హత వేటు ఎదుర్కుంటూ కొర్టును ఆశ్రయించిన రాములు నాయక్ స్థానం మార్చి 2న ఖాళీ కానుంది. దీంతో ఈ స్థానాల భర్తీ కోసం టీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది ఎదురుచూస్తున్నారు.

కర్నె ప్రభాకర్‌ను గతేడాది సెప్టెంబరులోనే మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమించడంతో ఆయన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్‌ లాంఛనమేననే ప్రచారం ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా అవకాశం దక్కని నాయిని.. గత కొంత కాలంగా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్‌ అవుతుందా? లేదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అయితే..ఈ టర్మ్‌లోనే కేటీఆర్ సీఎం బాధ్యతలు చేపడతారనే ప్రచార నేపథ్యంలో అసమ్మతి సెగలకు తావులేకుండా జాగ్రత్తపడే అవకాశాలున్నాయి. ఈ కోణంలో నాయిని పదవీ దక్కే అవకాశాలూ లేకపోలేదు.

మూడో ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావుకు ఉన్నత పదవులు ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ఇటీవల మునిసిపల్‌ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు వేరు కుంపటి పెట్టి తన అనుయాయులను గెలిపించుకున్నారు. వారిని తిరిగి గులాబీ గూటికి చేర్చారు. ఇక పార్టీలో ఇటీవల చేరినవారు, ఇప్పటివరకూ ఏ పదవి దక్కిని వారు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. దీంతో ఎవరి పేర్లు ఖరారవుతాయో పార్టీ వర్గాలు చెప్పలేకపోతున్నాయి. భవిష్యత్తులో ఏర్పడే ఎమ్మెల్సీ పదవుల ఖాళీలను లెక్కలోకి తీసుకొని, సామాజిక కోణంలో ఈసారి ఎంపిక ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.

ఇక శాసన మండలిలో ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఖాళీగా ఉంది. అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022 జనవరి 4 వరకు ఉంది. దీంతో భర్తీకి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ స్థానంలో ఇక్కడి ప్రాంతం వారికే ఆవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. తొలుత కె.ఆర్‌.సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, స్థానిక సంస్థల కోటాలో, అదీ తక్కువ కాలంలో రిటైర్‌ కావాల్సిన పదవి తీసుకోవటానికి వారు సుముఖంగా లేరని తెలిసింది. ఎమ్మెల్సీ కంటే, రాజ్యసభ సభ్యత్వం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వారి సన్నిహితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానానికి అరికెల నర్సారెడ్డి, ఈగ గంగారెడ్డి, ముజీబుద్దీన్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story