భారత్‌ను వెంటాడుతున్న కరోనా కేసులు

భారత్‌ను వెంటాడుతున్న కరోనా కేసులు

భారత దేశాన్ని కరోనా వైరస్‌ భయపెడుతూనే ఉంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భయం అవసరం లేదని చెబుతున్నా.. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరో కరోనా కేసు భారత్‌లో నమోదైంది. థాయిలాండ్‌, మలేషియా దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన ఢిల్లీ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 31కి చేరింది..

ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ కేసుతో ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య మూడుకు చేరిందని అధికారులు నిర్ధారించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 13మంది ఇరాన్‌కు చెందిన పర్యాటకులను వారు ఉంటున్న హోటల్‌ గదుల్లో ఐసోలేషన్‌ చేశారు. వీరిలో ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్‌ తేలకపోవడంతో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిచ్చారు.

కరోనాపై అలర్ట్‌ అయిన అధికారులు ఇప్పటికే 21 విమానాశ్రయాల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. మరో 9 విమానాశ్రయాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ టెస్ట్‌ నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 30కి పెరిగింది.

మరోవైపు తెలంగాణను కూడా కరోనా వణికిస్తోంది. జగిత్యాల జల్లాలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. గోపాల్‌రావుపేటకు చెందిన శ్రీహరి గత నెల 29న దుబాయ్‌ నుండి హైదరాబాద్ వచ్చారు. స్నేహితుల రూమ్‌లో ఒక రోజు ఉన్న తర్వాత..బస్‌లో గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా తగ్గలేదు.. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు..వెంటనే అతడిని అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో శ్రీహరి బస చేసిన రూమ్‌లోని అతడి స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story