మంగళవారం ఒక్కరోజే 865 కరోనా మరణాలు.. ఆందోళనలో అమెరికా

మంగళవారం ఒక్కరోజే 865 కరోనా మరణాలు.. ఆందోళనలో అమెరికా

అగ్రరాజ్యం అమెరికాను కరోనా కకావికలం చేస్తోంది. కరోనా వచ్చిన చైనాలో కంటే ఇక్కడ ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజు రోజుకీ ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజాగా కరోనా ధాటికి బలైన వారి సంఖ్య మంగళవారం ఒక్క రోజే 865మంది కావడంతో దీంతో మరణాల రేటు 3873కు చేరుకుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

చైనా, ఇటలీ, స్నెయిన్‌ దేశాల్లో కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ రాబోయే రెండు వారాలు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని.. ఇది ప్లేగు వ్యాధిని తలపిస్తుందని అన్నారు. కఠిన పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రతి అమెరికా పౌరుడు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ మహమ్మారి ధాటికి 2,40,000 మంది అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం వుందని వైట్ హౌస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ఏదీలేదని ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండడం ఒక్కటే మార్గమని పేర్కొన్నాయి. కాగా, కరోనా కాటుకు బలైన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల మంది అని లెక్కలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story