24 ఏళ్ళ కుర్రాడు... అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర

24 ఏళ్ళ కుర్రాడు... అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర

బహుశా అతను పదిమందికోసమే శ్వాసిస్తున్నాడేమో. బహుశా అతను పదిమంది కడుపునింపేందుకే జీవిస్తున్నాడేమో. ఎంత భారాన్నైనా స్వీకరించడానికి సిద్ధపడ్డాడేమో. కాకపోతే మరేమిటి..?నలభై డిగ్రీల ఉష్ఱోగ్రతలో.. నిప్పులకొలిమిలాంటి ఎండలో .. ఎలాంటి సంబంధంలేని వాళ్లకోసం అతను పడే తపన చూస్తే అలానే అనిపిస్తోంది. దుర్గాప్రసాద్‌ పరిగెడుతున్నాడు. గంజినీళ్ల నుంచి.. చిరుగుపాతల దుస్తుల నుంచి.. అప్పుల నుంచి ఆకలి నుంచి..కుటుంబ సమస్యల నుంచి.. ఇలా వేర్వేరు కారణాలతో నా అనే వాళ్లను వదిలేసి .. ఇళ్ల నుంచి పారిపోయి అనాధల్లా రోడ్లమీద బతుకుతున్న వాళ్లకోసం రోజూ పరిగెడుతున్నాడు. మండుటెండలో భాగ్యనగర వీధుల్లో ఒంటరిగా తానొక్కడే పరిగెడుతున్నాడు.

ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా, లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం అంటారు మహాకవి శ్రీశ్రీ. ఈ మాటలు దుర్గాప్రసాద్‌ బాగా ఒంటబట్టించుకున్నాడు. అందుకే తన జీవితాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకుంటున్నాడు. రంగుల కలల ప్రపంచంలో తానూ ఒక టాప్‌ డైరక్టర్‌ అవ్వాలనుకున్నా.. ఊహించని మలుపు తీసుకువచ్చింది లాక్‌డౌన్‌. 24 ఏళ్ల వయసు.. 50 రోజుల లాక్‌డౌన్‌. ఆ వయసులో ఎవరైనా ఏం చేయాలనుకుంటారు. పబ్‌ జీ.. యూట్యూబ్‌ వీడియోస్‌ చూస్తూ టైమ్‌ పాస్‌ చేస్తారు. కానీ.. దుర్గాప్రసాద్‌ వాళ్లందరికీ భిన్నంగా ఆలోచించాడు. రోడ్లపై ఉంటూ కనీసం ఒకపూట తిండి లేకుండా ఆకలితో అలమటిస్తున్న వాళ్ల కళ్లలో చిరునవ్వు చూడాలనుకున్నాడు. ఎంత కష్టమైనా.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే.. ఆ పని పూర్తిచేయాలనుకున్నాడు. అందరిలా అనుకుని నిద్రలేవగానే ఆ ఆలోచనను మర్చిపోలేదు. తన దగ్గరున్న పదో పరకతోనే ఆ యజ్ఞం మొదలుపెట్టాడు. పది యాభై అయింది. యాభై వంద అయింది. తన నిస్స్వార్ధ సేవను చూసిన ఎంతోమంది తామున్నామంటూ అండగా నిలిచారు. ఒక మంచి హృదయానికి వంద మంచి మనసులు తోడయ్యాయి. ఇప్పుడది మహాయజ్ఞమైంది. రోజూ దాదాపు 250 మంది కడుపులు నింపుతోంది.

ఇవాళ్టికి దుర్గాప్రసాద్‌ ఈ మహాయజ్ఞం మొదలుపెట్టి 60 రోజులైంది. నిర్విరామంగా నిరాటంకంగా సాగుతూనే ఉంది. ఎంతోమంది టాలెంట్‌ని చూపించడానికి వాడుకునే టిక్‌టాక్‌ యాప్‌ని కూడా ఈ మంచిపనికే వాడుకున్నాడు దుర్గాప్రసాద్‌. తాను చేస్తున్న సాయం పదిమందిలో ఆలోచన రగల్చాలనే కోరికతో అందులో వీడియోలు పోస్ట్‌ చేశాడు. వేలమంది అందుకు స్పందించారు. తనకు వెల్లువలా సాయం అందుతోంది. ఆ సాయాన్ని పదిమందికీ పంచడంలో ఇప్పుడు దుర్గాప్రసాద్‌ బిజీ అయిపోయాడు.

తాను చేసే ఈ పనిలోనే ఈ జీవితానికి సరిపడే ఆనందం ఉందంటాడు దుర్గాప్రసాద్‌. వేకువతోనే నిద్రలేచి కూరలు తరిగి.. వంటలు వండుతాడు. ఒక్కోరోజూ ఒక్కో స్పెషల్‌. దుర్గాప్రసాద్‌ ప్రాణస్నేహితుడు వెంకటేష్‌ సాయం. ఇద్దరూ కలిసి పదిగంటల కల్లా వంటలు పూర్తి చేస్తారు. ఇక కారులో మొత్తం సర్దుకుని రోడ్లమీదకు వెళతారు. ఒకచోట కారు ఆపి వండిన వాటిని పంచేసి వెళ్లడంతో అయిపోయిందనిపించుకోడు. నిజంగా ఆకలితో ఉన్నవాళ్లకు తన సేవ చేరాలన్నది అతని ఆలోచన. అందుకే వాళ్లను వెతుక్కుంటూ వెళతాడు. శుభ్రంగా శానిటైజర్‌తో చేతులు కడిగి వాళ్లు కడుపునిండా తినేదాకా అక్కడే ఉంటాడు. ఆకలి తీరాక వాళ్ల కళ్లలో ఆనందం చూసి కానీ అక్కడ నుంచి బయల్దేరడు.

నిజానికి డైరక్టర్‌ అవ్వాలనేది దుర్గాప్రసాద్‌ కల. ఆ కలను మోసుకుంటూనే పదేళ్ల క్రితం భాగ్యనగరానికి వచ్చాడు. నాలుగైదు సినిమాలకు అసిస్టెంట్‌ డైరక్టర్‌గా కూడా పనిచేశాడు. గల్లీ పోరడు అనే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి తన భావాలను అందులో పంచుకున్నాడు. ఇంతలో వచ్చిన మహమ్మారి.. దుర్గాప్రసాద్‌ జీవితాన్ని పూర్తిగా మార్చిపడేసింది. అవుతామో లేదో తెలియని ఆ రంగుల ప్రపపంచకంటే రోజూ రెండొందల మంది ముఖాల్లో కనిపించే చిరునవ్వే తనకు దీవెనలని అనుకున్నాడు. అందుకే.. ఇక పూర్తిగా పేదల సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు.

నిస్స్వార్ధ సేవ చేయాలంటే నిస్స్వార్ధమైన మంచి మనసు ఉండాలి. ఆ మనసు దుర్గాప్రసాద్‌కి ఉంది. ఇలాంటి మంచి వ్యక్తికి మరో పదిమంది సాయం చేయాలన్నదే అందరి ఉద్దేశం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితాంతం ఇలా సాయం చేస్తూనే ఉంటానని చెబుతున్నాడు దుర్గాప్రసాద్‌. మంచి మనసున్నవాళ్లంతా తన వెనక ఉంటే ఈ మహాయజ్ఞం మరింతగా చేస్తానని హామీ ఇస్తున్నాడు.

దుర్గాప్రసాద్‌ చేస్తున్న సేవ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి : https://bit.ly/2TvZCvL

------------------------------

ఫోన్ పే, గూగుల్ పే - 8328606880

(***సహాయం చేయాలనుకునేవారు ఒకసారి దుర్గాప్రసాద్ ని నేరుగా సంప్రదించండి - 8328606880 )

- కార్తీక్ పవన్

Read MoreRead Less
Next Story