వరంగల్‌లో శవమై తేలిన వలస కుటుంబం.. బావిలో మరో మూడు మృతదేహలు..

వరంగల్‌లో శవమై తేలిన వలస కుటుంబం.. బావిలో మరో మూడు మృతదేహలు..

వరంగల్‌ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వలసకూలీలు మరణించడం కలకలం రేపుతోంది. నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలోని బావిలో శుక్రవారం మరో మూడో మృతదేహాలను గుర్తించారు. బావిలో మృతదేహాలు తెలియాడుతూ కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.... మృతదేహాలను బయటికి తీశారు. గురువారం ఇదే బావిలో నలుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయినవారిసంఖ్య ఏడుకు చేరింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారే. ఎండీ మక్సూద్‌, ఆయన భార్య నిషా, కుమార్తె బుస్ర , కుమారుడు, మూడేళ్ల మనవడిగా గుర్తించారు.

ఎండీ మక్సూద్‌.. 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ నుంచి బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. గత డిసెంబరు నుంచి గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా... గత నెలన్నర నుంచి గోడౌన్‌లో ఉంటున్నాడు. మక్సూద్‌తోపాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ కుటుంబంతోపాటు బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం కూడా అదే ఆవరణలోని మరో గదిలో ఉంటున్నారు. ఎప్పటిలాగా... యజమాని సంతోష్‌ గురువారం మధ్యాహ్నం గోడౌన్‌కు వచ్చే సరికి కూలీలెవరూ కనిపించలేదు. వీరి కోసం వెతకగా... చివరికి పాడుబడ్డ బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం నాలుగు మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు..... ఈ ఉదయం మరో మూడు మృత దేహాలను బయటకు తీశారు.

ఈ కుటుంబాన్ని హత్య చేశారా? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇటీవలే మక్సూద్‌ మనవడి బర్త్‌డే వేడుకలు నిర్వహించగా...అందులో బిహార్‌ యువకులకు, స్థానిక యువకులకు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. మక్సూద్‌ కూతురు విషయంలోనే ఈ గొడవ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో కుటుంబంపై విషప్రయోగం జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ...అక్కడే పనిచేస్తున్న ఇద్దరు బీహార్‌ యువకులు కనిపించడం లేదు. దీంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వారు దొరికితేనే మక్సూద్‌ కుటుంబీకుల మృతికి కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story