భానుడు భగభగా.. నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు

భానుడు భగభగా.. నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు

దేశవ్యాప్తంగా భానుడు భగభగా మండుతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మూడు నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలకు తోడు వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఉదయం 10 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.. ఇంట్లోంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.. రోహిణీ కార్తె మొదలు కావడంతో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది.

పగలే కాదు.. రాత్రి వేళల్లోనూ వేడి ఏమాత్రం తగ్గడం లేదు.. చల్లటి గాలుల లేక, ఉక్కబోత భరించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. కొద్దిరోజులుగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లాక్‌ డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన జనం.. సడలింపులతో ఇప్పుడిప్పుడే అడుగు బయట పెడుతున్నారు.. అయితే, ఎండల దెబ్బకు ఠారెత్తిపోతున్నారు.

ఈ నెలఖారు వరకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికు రావద్దని హెచ్చరించారు. ఈనెలాఖరు వరకు భానుడి భగభగలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఏపీలోని కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 48 వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎండ వేడిమి మరింత పెరగనున్నట్లు ఐఎండీ తెలిపింది. 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story