ఐశ్వర్యా రాజేష్.. అందరిలాంటి అమ్మాయి కాదు..

ఐశ్వర్యా రాజేష్.. అందరిలాంటి అమ్మాయి కాదు..

ఈ రోజు స్టార్ హీరోయిన్‌గా ప్రశంసలందుకుంటున్న ఐశ్వర్యా రాజేష్.. జీవితంలో ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వెనుకడుగు వేయలేదు. Tedx వేదికగా తన జీవిత ప్రయాణంలోని విషాదాలను వివరించారు. ఇప్పటి వరకు దాదాపు 25 సినిమాల్లో నటించిన ఐశ్వర్య తన ప్రయాణంలో బాధ, సంతోషం, విజయం, ప్రేమ అన్నీ ఉన్నాయన్నారు.

చెన్నైలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఐశ్వర్య తండ్రి రాజేష్ సినిమాల్లో నటించేవారు. ఐశ్వర్యకు 8 ఏళ్ల వయసప్పుడే తండ్రి అనారోగ్యంతో మరణించారు. తల్లి చీరలమ్మి, ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేసి నలుగురు పిల్లల్ని పోషించేది. పెద్దన్నయ్య ఎదిగి వచ్చాడు కదా అనుకుంటే ఐశ్వర్యకు 13 ఏళ్లప్పుడు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో అన్నయ్య హోటల్ మేనేజ్‌‌మెంట్ చేయడంతో రూ.40వేలు జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. దాంతో కుటుంబాన్ని పోషిస్తాడని అమ్మ అనుకునేలోపు రోడ్డు ప్రమాదంలో అతడు మరణించాడు. రెండేళ్ల తేడాతోనే ఇద్దరన్నయ్యలు చనిపోయారు.

దాంతో అమ్మ మానసికంగా క్రుంగిపోయింది. ఐశ్వర్య చదువుకుంటూనే సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పని చేసి నెలకు రూ.5 వేలు సంపాదించి అమ్మకు సాయపడేది. ఆపై టీవీ సీరియల్‌లో అవకాశం వచ్చింది. అక్కడ రోజుకి రూ.1500 ఇచ్చేవారు. సీరియల్‌లో పని చేసే నటీనటులకు అయితే రూ.25వేలు ఇచ్చేవారు. ఇదేమని అమ్మని అడిగితే సినిమాల్లో నటించు.. ఎక్కువ ఇస్తారు అని చెప్పింది. దాంతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఆఫర్ల కోసం వెళితే ఎన్నో అవమానాలు.. హీరోయిన్ లక్షణాలే లేవు.. సహాయ నటిగా ప్రయత్నించు అని ఓ నిర్మాత ముఖం మీదే చెప్పారు.

లైంగిక వేధింపులు సినిమా రంగంలో ఎక్కువ. వాటిని ఎదుర్కుంది. 3ఏళ్లు ప్రయత్నించినా అవకాశం రాలేదు. 'అట్టకతి' అనే చిత్రంలో చిన్న పాత్ర వచ్చింది. తన జీవితాన్ని మార్చిన చిత్రం 'కాకా ముట్టె'. అందులో ఇద్దరు పిల్లలకు తల్లిగా. ఆ పాత్ర వేయడానికి ఎవరూ ముందుకు రాకపోయినా కధ నచ్చి అందులో నటించింది ఐశ్వర్య. ఆ తరవాత వచ్చిన 'కన్నా' పెద్ద హిట్. ఇన్నేళ్లలో ఓ నటిగా నన్నెవరూ సపోర్ట్ చేయలేదు. అప్పుడే అర్థమైంది. నన్ను నేనే ముందుకు తీసుకెళ్లాలి. అద్భుతాలు జరగవని. అదే నన్ను ఈరోజు ఈ స్థాయికి చేర్చింది అని తన జీవితం గురించి పంచుకున్నారు ఐశ్వర్య.

Tags

Read MoreRead Less
Next Story